సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ఒక ఈవెంట్‌లో మాట్లాడుతూ.. ఒక కీలకమైన విషయాన్ని బయటపెట్టారు. 2008లో ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL) ప్రారంభమైనప్పుడు తనకు ఒక టీమ్‌ను కొనుగోలు చేసే అవకాశం లభించిందని.. అయితే తాను దాన్ని తీసుకోలేదని సల్మాన్ ఖాన్ వెల్లడించారు. బాలీవుడ్ స్టార్లలో షారుక్ ఖాన్ కోల్‌కతా నైట్ రైడర్స్, ప్రీతి జింటా పంజాబ్ కింగ్స్ జట్టును కొనుగోలు చేసి ఐపీఎల్‌లో భాగమయ్యారు. సల్మాన్ ఖాన్ మాత్రం ఆ ఆఫర్‌ను తిరస్కరించారు.
ఐపీఎల్ ఆఫర్‌ను సల్మాన్ ఖాన్ ఎందుకు తిరస్కరించారు?
ముంబైలో జరిగిన ఒక ఈవెంట్‌లో భవిష్యత్తులో ఐపీఎల్ టీమ్ కొంటారా అని సల్మాన్ ఖాన్ అడిగినప్పుడు.. "ఐపీఎల్ కోసం మేము చాలా ఓల్డ్ అయ్యాం. ఐపీఎల్ ఆఫర్ మాకు వచ్చింది, కానీ మేం తీసుకోలేదు. నేను సంతోషంగా ఉన్నాను, కానీ ఎలాంటి పశ్చాత్తాపం లేదు. నేను చాలా సంతోషంగా ఉన్నాను." అని ఆయన అన్నారు. అంటే ఆ సమయంలో ఐపీఎల్ టీమ్‌ను కొనుగోలు చేయకపోవడం పట్ల ఆయనకు ఎలాంటి విచారం లేదని స్ఫష్టంగా చెప్పారు. తన నిర్ణయం పట్ల ఆయన సంతోషంగా ఉన్నారు. సల్మాన్ ఖాన్‌కు క్రికెట్ అంటే చాలా ఇష్టం. ఐపీఎల్‌లో ప్రీతి జింటా టీమ్, షారుక్ ఖాన్ టీమ్‌లకు ఆయన తరచుగా సోషల్ మీడియాలో మద్దతు తెలుపుతుంటారు. అలాగే, ఆయన స్వయంగా క్రికెట్ ఆడుతూ..భారత దిగ్గజ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీతో కలిసి కూడా చాలాసార్లు కనిపించారు.

బీసీసీఐ నుంచి ఆఫర్
2008లో ఐపీఎల్ ప్రారంభమైనప్పుడు అప్పటి ఐపీఎల్ ఛైర్మన్ లలిత్ మోడీ, బీసీసీఐ(BCCI) కలిసి బాలీవుడ్ స్టార్లను ఈ లీగ్‌లో భాగం చేయాలని నిర్ణయించుకున్నారు. అప్పుడు బాలీవుడ్ స్టార్స్‌ను ఐపీఎల్‌లోకి తీసుకురావడం వల్ల అభిమానుల్లో టోర్నమెంట్‌పై ఆసక్తి పెరుగుతుందని వారు భావించారు. ఈ క్రమంలోనే చాలా మంది బాలీవుడ్ ప్రముఖులకు టీమ్ కొనే ఆఫర్లు వచ్చాయి. అయితే సల్మాన్ ఖాన్ ఆ ఆఫర్‌ను తిరస్కరించారు. ప్రస్తుతం సల్మాన్ ఖాన్ 'గల్వాన్' అనే సినిమాలో నటిస్తున్నారు. ఆయన చివరి చిత్రం 'సికందర్' బాక్సాఫీస్ వద్ద అంతగా రాణించలేదు.