
హైదరాబాద్: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ గురువారం చేసిన ఓ ట్వీట్ మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని రిటైర్మెంట్ ఊహాగానాలకు తావిచ్చిన సంగతి తెలిసిందే. తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని ప్రకటించడానికి గురువారం సాయంత్రం మీడియా సమావేశం ఏర్పాటు చేశాడనే వార్తలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేశాయి.
ఇప్పటికే జట్టు మేనేజ్‌మెంట్‌కు తన నిర్ణయాన్ని చెప్పేశాడని... గురువారం తన నిర్ణయాన్ని మీడియా సమావేశంలో వెల్లడించనున్నట్లు ఊహాగానాలు వినిపించాయి. అయితే ఈ వార్తలపై ధోని సతీమణి సాక్షి ధోని స్పందించారు. ధోని రిటైర్మెంట్‌పై వస్తున్న వార్తలు రూమర్స్ అంటూ కొట్టిపారేశారు. ఈ మేరకు సాక్షి ట్వీట్ చేశారు.
కాగా, ధోని రిటైర్మెంట్ వార్తలపై దక్షిణాఫ్రికాతో టెస్టు సిరిస్‌కు జట్టుని ప్రకటించే సమయంలో ఛీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ సైతం స్పందించాడు. ధోనీ రిటైర్మెంట్ అంశానికి సంబంధించి తమకు ఎటువంటి సమాచారం అందలేదని తెలిపిన ఎమ్మెస్కే ప్రసాద్.. ధోని రిటైర్మెంట్‌పై వస్తున్న వార్తల్లో నిజం లేదని స్పష్టం చేశాడు.
ధోని రిటైర్మెంట్, ప్రెస్ మీట్‌పై తమకు అధికారిక సమాచారం లేదని బీసీసీఐ సైతం పేర్కొంది. దక్షిణాఫ్రికాతో సెప్టెంబర్ 15న దక్షిణాఫ్రితో జరగనున్న టీ20 సిరీస్‌కు ఎంపిక చేసిన భారత జట్టులో ధోనీకి చోటు దక్కలేదు. దీంతో ధోనీ క్రికెట్‌కు వీడ్కోలు పలకనున్నట్లు వార్తలు వచ్చాయి. ఇప్పటికే టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించిన ధోని.. పరిమిత ఓవర్ల క్రికెట్ మాత్రమే ఆడుతున్నాడు.
అయితే గత కొద్దికాలంగా పేలవ ఫామ్‌తో బ్యాటింగ్‌లో విఫలమవుతున్న ధోనిపై విమర్షల వర్షం కురుస్తోంది. ఇంగ్లాండ్ వేదికగా వన్డే వరల్డ్ కప్ ముగిసిన తర్వాత భారత ఆర్మీకి సేవలందించాలనే ఉద్దేశంతో రెండు నెలల పాటు ధోని క్రికెట్ నుంచి విశ్రాంతి తీసుకున్నాడు. విశ్రాంత సమయంలో ధోని కుటుంబ సభ్యులతో ఎంజాయ్ చేస్తున్నాడు.