
హైదరాబాద్: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనికి బైకులంటే చాలా ఇష్టం అనే సంగతి తెలిసిందే. ఇదే విషయాన్ని ధోని సైతం పలు సందర్భాల్లో వెల్లడించాడు. తాజాగా ధోనీ భార్య సాక్షి కూడా ఇదే విషయాన్ని వెల్లడించింది. "ధోని బాగా ప్రేమించే టాయ్స్" అంటూ సాక్షి తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ ఫొటోను పంచుకుంది.
ఈ ఫొటోలో ఉన్నది ధోని బైక్స్ మ్యూజియం. అయితే బైక్స్ మ్యూజియం ఎక్కడిది అన్న విషయాన్ని సాక్షి స్పష్టంగా చెప్పలేదు. అయితే, ఈ ఫోటోని చూసిన అభిమానులు మాత్రం ఇది "ధోని బైక్ మ్యూజియం, రాంచీలోని తన ఇంటి ఆవరణలో ధోని ఏర్పాటు చేసుకున్న బైక్ మ్యూజియం ఇదే' అంటూ కామెంట్లు పెడుతున్నారు.
ధోని వద్ద ఇప్పటికే అనేక బైకులు ఉన్నాయి. వీటిలో విదేశాలకు చెందిన బైకులతో పాటు ఖరీదైన బైకులు కూడా ఉన్నాయి. కాగా, ఇటీవలే ఇంగ్లాండ్ పర్యటన ముగించుకుని భారత్‌కు తిరిగొచ్చిన ధోని ప్రస్తుతం కుటుంబ సభ్యులతో గడుపుతున్నాడు. అదేవిధంగా పలు యాడ్స్‌లో సైతం నటిస్తున్నాడు.
రెండు రోజుల క్రితం దేశంలోని తొలి 360 డిగ్రీల పర్యావరణ సహిత క్రీడా సాంకేతిక సంస్థగా నిలిచిన 'రన్ ఆడం'కు ధోని బ్రాండ్ అంబాసిడర్‌గా ఉండేందుకు ఒప్పందం చేసుకున్నాడు. ఈ కంపెనీలో ఇప్పటికే 25 శాతం వాటా కూడా తీసుకున్నారు. ధోనీ ముందుండి నడిపిస్తే తమ సంస్థ మరింత వృద్ధి చెందుతుందని యాజమాన్యం వెల్లడించింది.