అమ్మ నగలు అమ్మి పంపితే.. ఐపీఎల్ హిస్టరీ తిరగరాశాడు!
సోమవారం హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగిన ఐపీఎల్ 2026 మ్యాచ్ ఓ చారిత్రాత్మక ఘట్టానికి వేదికైంది. రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరపున అరంగేట్రం చేసిన బీహార్ యువ ఫాస్ట్ బౌలర్ సాకిబ్ హుస్సేన్ తన పదునైన బంతులతో ప్రత్యర్థి జట్టు నడ్డి విరిచాడు. కేవలం 21 ఏళ్ల వయసులో, తన అరంగేట్ర మ్యాచ్‌లోనే 24 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఈ అద్భుత ప్రదర్శనతో హైదరాబాద్ 57 పరుగుల భారీ విజయాన్ని అందుకుంది.
సైనికుడు కావాలనుకుని.. క్రికెటర్ అయ్యాడు
బీహార్‌లోని గోపాల్‌గంజ్ అనే ఓ చిన్న గ్రామం నుంచి ఐపీఎల్ వంటి భారీ వేదిక వరకు సాకిబ్ హుస్సేన్ చేరుకున్న తీరు అసాధారణం. సాకిబ్ హుస్సేన్ తండ్రి ఒక సామాన్య కూలీ. రోజుకు కేవలం 200 నుండి 300 రూపాయల సంపాదనతో ఐదుగురు సభ్యులున్న కుటుంబాన్ని పోషించడం వారికి గగనమైపోయేది. చదువుకుని డాక్టర్ కావాలనో, ఇంజనీర్ కావాలనో కలలు కనడం కూడా ఆ కుటుంబానికి ఒక విలాసంగా అనిపించేది. అటువంటి కటిక పేదరికంలో పెరిగిన సాకిబ్, దేశం కోసం ఏదైనా చేయాలనే కసితో మొదట ఆర్మీలో చేరాలని భావించాడు. కానీ అతని వేగవంతమైన బౌలింగ్ అతడిని క్రికెట్ మైదానానికి పరిచయం చేసింది.

అమ్మ త్యాగం.. ఆ పదివేల రూపాయల షూస్:
క్రికెట్ పట్ల ఆసక్తి పెరిగిన తర్వాత సాకిబ్ హుస్సేన్ వేగంగా బౌలింగ్ చేయడం గమనించిన అతని స్నేహితులు అతడిని ప్రోత్సహించారు. అయితే ప్రొఫెషనల్ క్రికెట్ ఆడటానికి కావాల్సిన స్పైక్ షూస్ కొనడం సాకిబ్ తండ్రికి సాధ్యం కాలేదు. ఆ షూస్ ధర సుమారు 10-15 వేల రూపాయలు. కొడుకు బాధను చూడలేక.. సాకిబ్ కలలు పేదరికంలో కాలిపోకూడదని భావించిన సాకిబ్ తల్లి, తన వద్ద ఉన్న కొద్దిపాటి బంగారు నగలను అమ్మి ఆ డబ్బుతో షూస్ కొనిచ్చింది. ఆ షూస్ ధరించి మైదానంలోకి దిగినప్పుడు, తన తల్లి త్యాగానికి వెల కట్టలేని విజయాన్ని అందించాలని సాకిబ్ హుస్సేన్ గట్టిగా నిశ్చయించుకున్నాడు.
దేశవాళీ క్రికెట్‌లో సత్తా:
సాకిబ్ హుస్సేన్ ప్రతిభ కేవలం అదృష్టం మీద ఆధారపడలేదు. కేవలం 17 ఏళ్ల వయసులోనే బీహార్ సీనియర్ జట్టులోకి ఎంపికై సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో అరంగేట్రం చేశాడు. తన రెండో మ్యాచ్‌లోనే 4 వికెట్లు తీసి సెలక్టర్ల దృష్టిని ఆకర్షించాడు. 2024లో కోల్‌కతా నైట్ రైడర్స్ అతడిని కొనుగోలు చేసినప్పటికీ, ఒక్క మ్యాచ్‌లో కూడా ఆడే అవకాశం రాలేదు. ఆ నిరాశను పక్కన పెట్టి, 2025-26 రంజీ సీజన్‌లో అరుణాచల్ ప్రదేశ్‌పై 6 వికెట్లు తీసి తాను రెడ్ బాల్ క్రికెట్‌లో కూడా మొనగాడినని నిరూపించుకున్నాడు.
ఐపీఎల్ 2026.. సన్‌రైజర్స్‌లో సంచలనం
2026 ఐపీఎల్ వేలంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ సాకిబ్ హుస్సేన్‌ను 30 లక్షల రూపాయలకు దక్కించుకుంది. రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన తన మొదటి మ్యాచ్‌లోనే అద్భుతం చేశాడు. తన పదునైన బంతులతో రాజస్థాన్ బ్యాటర్లను వణికించి 4 వికెట్లు పడగొట్టాడు. ఈ ప్రదర్శనతో తన అరంగేట్రం మ్యాచ్‌లోనే చరిత్ర సృష్టించాడు. సహచర బౌలర్ ప్రఫుల్ హింగేతో కలిసి రాజస్థాన్ రాయల్స్ బ్యాటింగ్ ఆర్డర్‌ను కకావికలం చేసి, హైదరాబాద్ జట్టుకు 57 పరుగుల భారీ విజయాన్ని అందించాడు. ఒకప్పుడు షూస్ కోసం కన్నీళ్లు పెట్టుకున్న అదే సాకిబ్ హుస్సేన్, నేడు తన వేగంతో ప్రత్యర్థి బ్యాటర్ల కళ్లలో నీళ్లు తెప్పిస్తున్నాడు. సాకిబ్ కథ కేవలం ఒక క్రికెటర్ సక్సెస్ స్టోరీ మాత్రమే కాదు, పట్టుదల ఉంటే పేదరికం ఏ సాధనకూ అడ్డుకాదని నిరూపించే ఒక గొప్ప పాఠం. తన తల్లి అమ్మిన నగలకు ఐపీఎల్ వికెట్లతో బదులిచ్చిన ఈ కుర్రాడు, భారత క్రికెట్ భవిష్యత్ ఆశాకిరణంగా మారుతున్నాడు.
గురువుకు కృతజ్ఞతలు
తన విజయానికి ప్రధాన కారణం సన్‌రైజర్స్ బౌలింగ్ కోచ్, మాజీ భారత పేసర్ వరుణ్ ఆరోన్ అని సాకిబ్ తెలిపాడు. "వరుణ్ భాయ్ గత నాలుగేళ్లుగా నాతో కలిసి పని చేస్తున్నారు. నా బౌలింగ్‌లో మీరు చూస్తున్న మార్పులకు ఆయనే కారణం. మ్యాచ్‌కు ఒకరోజు ముందే నేను ఆడుతున్నానని చెప్పి నన్ను మానసిక సిద్ధం చేశారు" అని సాకిబ్ హుస్సేన్ భావోద్వేగంతో చెప్పుకొచ్చాడు. తల్లి త్యాగం, తండ్రి కష్టం, గురువు శిక్షణ.. ఇవన్నీ కలిస్తేనే నేడు సాకిబ్ హుస్సేన్ ఐపీఎల్ చరిత్రలో అత్యుత్తమ అరంగేట్రం చేసిన బౌలర్ల జాబితాలో చేరగలిగాడు. ఓ సామాన్య పేద కుటుంబం నుంచి వచ్చి దేశం దృష్టిని ఆకర్షించిన సాకిబ్, నేటి యువతకు ఒక గొప్ప ప్రేరణ.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications