భారత జట్టకు ప్రధాన కోచ్‌గా గౌతమ్ గంభీర్ ఎంపికయ్యాడు. కానీ అతని సహాయక సిబ్బంది ఎవరనే ఉత్కంఠ ఇంకా కొనసాగుతోంది. గంభీర సిఫార్సు చేసిన జాబితాలో కొందరికి బీసీసీఐ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కానీ మరికొందరిని మాత్రం అంగీకరించట్లేదు. అసిస్టెంట్ కోచ్‌లుగా అభిషేక్ నాయర్, ర్యాన్ టెన్ డస్కౌటెల ఎంపిక దాదాపు ఖాయమైంది.
ఇక బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్ కూడా ఎంపికయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొదట బీసీసీఐ బౌలింగ్ కోచ్ విషయంలో భారత మాజీ క్రికెటర్లనే ఎంపిక చేయాలని భావించింది. కానీ గంభీర్ పట్టుపట్టడంతో మోర్కెల్‌ను తప్పక అంగీకరించే పరిస్థితి ఎదురైంది. మరోవైపు జులై 27 నుంచి శ్రీలంకతో భారత్ మూడు టీ20లు, మూడు వన్డేలు ఆడనుంది.

మరో రెండు రోజుల్లో లంకకు టీమిండియా బయల్దేరనుంది. ఈ నేపథ్యంలో గంభీర్‌తో చర్చలు తేలేవరకు తాత్కాలిక సహాయక కోచ్‌లు నియమించాలని బీసీసీఐ నిర్ణయించింది. తాత్కాలిక బౌలింగ్ కోచ్‌గా సాయిరాజ్ బహుతులేని నియమించింది. లంక పర్యటన మొత్తానికి బహుతులేనే బౌలింగ్ కోచ్ బాధ్యతలు నిర్వర్తించనున్నాడని సమాచారం.
ఎవరీ సాయిరాజ్ బహుతులే?
సాయిరాజ్ బహుతులే ప్రస్తుతం జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్‌సీఏ)లో సేవలు అందిస్తున్నాడు. భారత్ తరఫున రెండు టెస్టులు, నాలుగు వన్డేలు ఆడాడు. 1997లో భారత్ తరఫున అరంగేట్రం చేసిన అతను అయిదు వికెట్లు పడగొట్టాడు. అయితే ఈ లెగ్ స్పిన్నర్‌కు కోచ్‌గా అనుభవం ఉంది. 2014లో కేరళ క్రికెట్ జట్టుకు, 2015లో బెంగాల్ క్రికెట్ జట్టుకు కోచ్‌గా బాధ్యతలు నిర్వర్తించాడు. ఐపీఎల్‌లో 2018లో రాజస్థాన్ రాయల్స్‌కు స్పిన్ బౌలింగ్ కోచ్‌గా సేవలందించాడు.
కాగా, శ్రీలంక పర్యటన ముగిసిన అనంతరం సాయిరాజ్ బహుతులే తిరిగి ఎన్సీఏకి వెళ్తాడు. ఈలోపు సహాయక సిబ్బంది ఎంపిక పూర్తవుతుంది. సెప్టెంబర్‌లో జరగనున్న బంగ్లాదేశ్ పర్యటన నుంచి కొత్త అసిస్టెంట్ కోచ్‌లు తమ యాక్షన్ మొదలుపెట్టనున్నారు.