T20 World Cup 2026: టీ20 ప్రపంచ కప్ 2026లో భాగంగా నమీబియాతో జరిగిన కీలక పోరులో పాకిస్థాన్ ఓపెనర్ సాహిబ్జాద్ ఫర్హాన్ అద్భుత సెంచరీతో రికార్డు సృష్టించినప్పటికీ.. ప్రస్తుతం అతను తీవ్ర విమర్శలను ఎదుర్కొంటున్నాడు. జట్టు స్కోరు కంటే తన వ్యక్తిగత మైలురాయికే సాహిబ్జాద్ ఫర్హాన్ ప్రాధాన్యత ఇచ్చాడని భారత మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ ఘాటుగా విమర్శించాడు.
అసలేం జరిగిందంటే?
సూపర్-8 దశకు చేరుకోవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో పాకిస్థాన్ మొదట బ్యాటింగ్ చేసింది. ఓపెనర్ సాహిబ్జాదా ఫర్హాన్ 58 బంతుల్లో 11 ఫోర్లు 4 సిక్సర్లతో 100 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. తద్వారా అహ్మద్ షెహజాద్ తర్వాత ప్రపంచ కప్‌లో సెంచరీ సాధించిన రెండో పాక్ ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. అయితే ఇన్నింగ్స్ 20వ ఓవర్లో ఫర్హాన్ ప్రవర్తించిన తీరు వివాదాస్పదమైంది. చివరి ఓవర్లో ఫర్హాన్ 99 పరుగుల వద్ద ఉన్నప్పుడు జట్టు స్కోరు పెంచడానికి ప్రయత్నించకుండా కేవలం సింగిల్ తీసి సెంచరీ పూర్తి చేసుకోవడానికే ప్రాధాన్యత ఇచ్చాడు. అంతే కాకుండా.. ఆఖరి బంతి వైడ్ లైన్‌కు దగ్గరగా వెళ్తున్నా.. దానిని షాట్ ఆడే ప్రయత్నం చేయకుండా వదిలేశాడు. డెత్ ఓవర్లలో ఇలాంటి డిఫెన్సివ్ ఆట తీరు కామెంటేటర్లను ఆశ్చర్యానికి గురిచేసింది.

ఇర్ఫాన్ పఠాన్ ఫైర్
లైవ్ కామెంటరీలో ఉన్న ఇర్ఫాన్ పఠాన్.. సాహిబ్జాదా ఫర్హాన్ ఆటతీరును తప్పుబట్టారు."అతను సెంచరీ చేయడం సంతోషమే, కానీ ఆఖరి ఓవర్లో కేవలం ఒక పరుగు కోసం అంత నిదానంగా ఆడతారా? ఇది నమ్మశక్యం కాని విషయం. చివరి బంతిని కూడా వదిలేయడం విడ్డూరంగా ఉంది. జట్టు ప్రయోజనాల కంటే వ్యక్తిగత రికార్డులే ముఖ్యమనుకోవడం సరైంది కాదు. ఒకవేళ చివర్లో షాదాబ్ ఖాన్ ఆ రెండు సిక్సర్లు కొట్టకపోతే పాక్ స్కోరు 199కి చేరేది కాదు." అని పఠాన్ విమర్శించారు.
పాకిస్థాన్ ఘన విజయం
విమర్శలు పక్కన పెడితే ఫర్హాన్ సెంచరీ (100*), షాదాబ్ ఖాన్ మెరుపు ఇన్నింగ్స్ (35) పుణ్యమా అని పాకిస్థాన్ 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 199 పరుగులు చేసింది. అనంతరం 200 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన నమీబియాను 97 పరుగులకే కుప్పకూల్చింది. దీనితో 102 పరుగుల భారీ తేడాతో విజయం సాధించిన పాకిస్థాన్.. సూపర్-8 రౌండ్‌కు అర్హత సాధించింది.