
హైదరాబాద్: టీమిండియా మాజీ క్రికెటర్ జహీర్ ఖాన్, బాలీవుడ్ నటి సాగరిక ఘట్గేల పెళ్లి చాలా సింపుల్‌గా జరిగింది. గురువారం ఉదయం ముంబై రిజస్టర్ ఆఫీసులో వీరిద్దరూ వివాహం చేసుకున‍్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు గురువారం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. గులాబి రంగు కుర్తాలో జహీర్, నారింజ పండు రంగు చీర, ప్రత్యేక ఆభరణాలు ధరించిన సాగరిక జోడీ చూడముచ్చటగా ఉంది.
ఈ ఫోటోలను జహీర్ ఖాన్ ఫిట్‌నెస్ స్టూడియో బిజినెస్ కార్యకలాపాలను చూసుకుంటున్న అంజనా శర్మ తన ఇనిస్టాగ్రామ్‌లో పోస్టు చేశారు. ఈ ఫోటోల్లో జహీర్ ఖాన్, సాగరిక ఘట్గేలు చాలా సంతోషంగా ఉన్నారు. వీరి పెళ్లి నవంబర్ 27న ముంబైలోని తాజ్ మహల్ ప్యాలెస్ హోటల్‌లో అంగరంగ వైభవంగా జరగనుంది.
ఈ పెళ్లి అనంతరం సాయంత్రం హోటల్‌లోనే కాక్‌టేల్ పార్టీ ఏర్పాటు చేశారు. కాగా, పెళ్లికి ముందు నిర్వహించే మెహందీ ఫంక్షన్ ఆదివారం జరగనుంది. పెళ్లికి ఇంకా నాలుగు రోజులే సమయం ఉండటంతో ఇద్దరూ పెళ్లి పనుల్లో బిజీగా ఉన్నారు.
పెళ్లికి అత్యంత సన్నిహితులు, స్నేహితులే హాజరుకానున్నారు. వివాహం అనంతరం ముంబై, పుణెలో జహీర్ దంపతులు సన్నిహితులు, స్నేహితుల కోసం ప్రత్యేకంగా రిసెప్షన్ నిర్వహించనుంది. ఈ వివాహ రిసెప్షన్‌కు రాజకీయ, బాలీవుడ్ ప్రముఖులతో పాటు పలువురు క్రికెటర్లు కూడా హాజరు కానున్నారు.
ఇందుకు సంబంధించి ఇరు కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు. సాగరికతో నిశ్చితార్థం జరిగినట్లు ఈ ఏడాది ఏప్రిల్ 25న ట్విటర్ ద్వారా జహీర్ వెల్లడించిన సంగతి తెలిసిందే.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.