
రాయ్‌పూర్: రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్ 2021 రాయ్‌పూర్ వేదికగా జరుగుతున్న విషయం తెలిసిందే. ప్రపంచ క్రికెట్ మాజీలు ఇందులో పాల్గొంటున్నారు. రోడ్డు ప్రమాదాలపై అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో మహారాష్ట్ర ప్రభుత్వ రోడ్డు భద్రతా విభాగం.. అన్ అకాడమీ ఫ్రోఫెషనల్ మేనేజ్‌మెంట్ గ్రూప్ సంయుక్తంగా ఈ టోర్నీ నిర్వహిస్తోంది. అయితే ఈ టోర్నీలో పాల్గొనే వారికి కరోనా టెస్ట్ తప్పనిసరి. మ్యాచుకు ముందు ఆటగాళ్లకు టెస్టులు చేస్తారు. కరోనా టెస్ట్ సందర్భంగా క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్.. మెడికల్ సిబ్బందిని సరదాగా ఆటపట్టించాడు.
రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్ 2021లో భాగంగా ఈరోజు (మంగళవారం) రాత్రి ఇండియా లెజెండ్స్ జట్టు ఇంగ్లండ్ లెజెండ్స్ టీంతో తలపడనుంది. ఈ మ్యాచ్‌కు ముందు ఇరు జట్ల ఆటగాళ్లకు రొటీన్ కరోనా వైరస్ పరీక్షలు నిర్వహించారు. ఇందులో భాగంగా ఇండియా లెజెండ్స్ కెప్టెన్ సచిన్ టెండూల్కర్‌కు టెస్ట్ చేశారు. మెడికల్ సిబ్బంది తన ముక్కులో నుంచి స్వాబ్ తీసుకున్న తర్వాత నొప్పితో బాధపడినట్లు సచిన్ నటించాడు. అది చూసి వైద్య సిబ్బంది కంగారుపడగా.. సచిన్ నెమ్మదిగా ఓ నవ్వునవ్వాడు. దీంతో ఆ టెస్ట్ చేసిన వారు ఒక్కసారిగా ఊపిరిపీల్చుకున్నారు.
మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ఇదంతా సరదాగా చేశాడు. స్వయంగా ఆ వీడియోను సచిన్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశాడు. 'నేను 200 టెస్టులు ఆడాను. 277 కొవిడ్ టెస్టులు చేయించుకున్నాను. కాస్త చిలిపి పని చేయడం మూడ్‌ను లైట్ చేస్తుంది' అని ఆ వీడియోకు కాప్షన్ జతచేశాడు. ప్రస్తుతం సచిన్ టెండూల్కర్‌కు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అభిమానులు సరదాగా స్పందిస్తున్నారు. 'నాటీ సచిన్', 'మాస్టర్.. చిలిపి చేష్టలు' అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
బంగ్లాదేశ్ లెజెండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సచిన్ తన మార్క్ ఇన్నింగ్స్ ఎలా ఉంటుందో మరోసారి రుచి చూపించాడు. సెహ్వాగ్ ఇన్నింగ్స్ దాటికి సచిన్ ఇన్నింగ్స్ పక్కన పెట్టాల్సి వచ్చింది కానీ మాస్టర్ ఆటలో కొన్ని క్లాసిక్ షాట్లు ఉన్నాయి. ఈ మ్యాచ్‌లో సచిన్ చేసింది 33 పరుగులే అయినా.. అతను కొట్టిన 5 బౌండరీలు ఒక్కో కళాత్మక షాట్‌గా పరిగణించవచ్చు. బ్యాటింగ్ టెక్నిక్‌లో అదే స్టైల్ మెయింటేన్ చేయడం సచిన్‌కు మాత్రమే సాధ్యమైంది.
1989 నుంచి 24 ఏళ్ల పాటు క్రికెట్ ఆడిన సచిన్.. అంతర్జాతీయ క్రికెట్‌లో 100 శతకాలు నమోదు చేసిన ఏకైక బ్యాట్స్‌మెన్‌గా రికార్డ్ నెలకొల్పాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో ఇప్పటివరకు ఎవరికీ సాధ్యంకానన్ని పరుగులతో సచిన్ అగ్రస్థానంలో నిలిచాడు. లిటిల్ మాస్టర్ తన కెరీర్ మొత్తంలో 34,357 పరుగులు బాదాడు. టెస్టుల్లో 15,921.. వన్డేల్లో 18426, టీ20ల్లో 10 రన్స్ చేశారు. వన్డేల్లో తొలి ద్విశతకం బాదిన క్రికెటర్‌గా సచిన్ చరిత్ర సృష్టించాడు.