
హైదరాబాద్: రాజకీయాల వల్లే యాషెస్ తరహాలో భారత్-పాక్ మ్యాచ్‌లను చూడలేకపోతున్నామని పాకిస్థాన్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ అభిప్రాయపడ్డాడు. 2008లో జరిగిన ముంబై పేలుళ్ల ఘటన అనంతరం దాయాది దేశాల మధ్య పూర్తిస్థాయి ద్వైపాక్షిక సిరీస్‌లు జరగలేదు.
2012లో చిన్నపాటి సిరిస్ ఆడినప్పటికీ, ప్రస్తుతం ఇరు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా భారత్-పాక్‌ల మధ్య సిరిస్‌లు జరగడం కష్టమే. తాజాగా మంగళవారం పీటీఐకి ఇచ్చిన ఇంటర్యూలో షోయబ్ అక్తర్ మాట్లాడుతూ 'సరిహద్దుల సమస్యల కారణంగా ఇరు దేశాల క్రికెటర్లు ద్వైపాక్షిక సిరీస్‌లో లభించే గొప్ప అనుభవాన్ని కోల్పోతున్నారు' అని ఆవేదన వ్యక్తం చేశాడు.
'క్రికెట్‌లో యాషెస్ సిరీస్‌తో సమానంగా జరిగే ఓ గొప్ప సిరీస్‌కు దూరమవుతున్నారు. అంతేకాదు ఈ సిరిస్‌లు జరగకపోవడం వల్ల రాత్రికి రాత్రే హీరో అయ్యే అవకాశాలను ఇరు జట్లకు చెందిన ఆటగాళ్లు కోల్పోతున్నారు. పాక్ ఆటగాళ్లకు భారత్‌లో ఎంతో అభిమానం లభించేది. భారతీయులు నన్నెంతో ప్రేమించారు' అని అక్తర్ తెలిపాడు.
'ప్రతిభను ప్రదర్శించి ప్రస్తుత పాక్ క్రీడాకారులు అదే ప్రేమను పొందాలని నేను కోరుకుంటున్నాను. దేశ రాజకీయాలతో క్రీడా సంబంధాలు దెబ్బతీనడం విచారకరమైన విషయం. ఇరు జట్ల క్రికెట్ బోర్డులు చొరువ తీసుకొని ద్వైపాక్షిక సిరీస్‌లు జరిగేలా కృషి చేయాలని' అని అక్తర్ అభిప్రాయపడ్డారు.
ఆసియా టెస్టు ఛాంపియన్‌షిప్‌లో భాగంగా 1999లో కోల్‌కతా వేదికగా జరిగిన మ్యాచ్‌లో వరుస బంతుల్లో సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రవిడ్‌ను ఔట్ చేసిన అక్తర్ పాకిస్థాన్‌లో రాత్రికి రాత్రే గొప్ప హీరో అయ్యాడు. 'భారత్, పాక్ మధ్య మ్యాచ్‌లు జరగాలి. ఇది జరగకపోతే అనవసరమైన ప్రకటనలు చేయడం మానుకోవాలి' అని అక్తర్ సూచించాడు.
'ప్రస్తుతం రెండు జట్లు ఐసీసీ టోర్నీల్లో మాత్రమే తలపడుతున్నాయి. రెండు దేశాల మధ్య దౌత్యపరమైన చర్చలు జరిగే వరకు ద్వైపాక్షిక సిరీస్‌లు జరిగే అవకాశమే లేదు. క్రీడలను రాజకీయాలకు దూరంగా ఉంచాలని తరచూ చెబుతున్నప్పటికీ ఇప్పుడు దౌత్యపరమైన చర్యల వరకు వెళ్లడం బాధాకరం. ఇందులో రెండు బోర్డుల తప్పేమీ లేదు' అని అక్తర్ అన్నాడు.
ఇదిలా ఉంటే ఉగ్రవాద చర్యలు ఆపేంత వరకు పాకిస్థాన్‌తో క్రీడా సంబంధాలు ఉండవని భారత ప్రభుత్వం తేల్చి చెప్పిన సంగతి తెలిసిందే.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.