ముంబై: భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ఇంట్లో వినాయక చవితి వేడుకలు సోమవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. కాగా, ఈ సందర్భంగా ఆయన ఇంటికి ఇద్దరు ప్రముఖులు అతిథులుగా వచ్చారు. వెనక నుంచి తీసిన ఓ ఫోటోను ట్విట్టర్ పోస్టు చేసి మొదట ఆ అతిథి ఎవరూ? అంటూ సచిన్ టెస్ట్ చేశాడు.
అంతే, సచిన్ అభిమానులు ఉత్సాహంతో చాలా సమాధాలే పోస్ట్ చేశారు. ఒకరు రోజర్ ఫెదరర్ అని, మరొకరు రికీ పాంటింగ్ అని, సౌరవ్ గంగూలీ.. బ్రెట్ లీ అని ఇంకొకరు ఇలా ఎవరికి తోచిన సమాధానాలు వారు చెప్పుకుంటూ పోయారు.దీంతో నెటిజన్లను విసిగించడం బాగోదని సచిన్ స్వయంగా ఆ గెస్ట్‌ను వెల్లడించాడు. అతను ఎవరో కాదు దక్షిణాఫ్రికా పీల్డింగ్ దిగ్గజం జాంటీ రోడ్స్.

భారతీయ సంస్కృతి, సంప్రదాయాలంటే జాంటీ రోడ్స్‌కి ఎనలేని గౌరవమన్న విషయం తెలిసిందే. అందుకే తన కూతురికి 'ఇండియా' అని పేరు కూడా పెట్టుకున్నాడు. అతనే గణపతి ఆశీస్సులు పొందేందుకు తన ఇంటికి వచ్చాడని సచిన్ తెలిపాడు. జాంటీరోడ్స్‌తోపాటు భారత ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ కూడా సచిన్ ఇంట్లో జరిగిన వినాయక చవితి వేడుకల్లో పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేశాడు.