క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ తన కుటుంబంతో కలిసి ఇటీవల మధ్యప్రదేశ్‌లోని చారిత్రక, ఆధ్యాత్మిక పట్టణం మహేశ్వర్‌ను సందర్శించారు. ఈ పర్యటనలో ఆయనతో పాటు భార్య అంజలి, కుమార్తె సారా టెండూల్కర్, తల్లి, ఇటీవల అర్జున్ టెండూల్కర్‌తో నిశ్చితార్థం చేసుకున్న కాబోయే కోడలు సానియా చందోక్ కూడా ఉన్నారు. అర్జున్ టెండూల్కర్ మాత్రం ఈ యాత్రలో కనిపించలేదు. మహేశ్వర్‌లోని ప్రకృతి అందాలు, చారిత్రక ప్రదేశాలను చూసి ముగ్ధులైన సచిన్, తన పర్యటన విశేషాలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఈ క్రమంలో కొంత మంది పెళ్లికాక ముందే అత్తగారి కుటుంబంతో కలిసి పుణ్యక్షేత్రాలకు వెళ్తారా.. అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరికొంత మంది తన స్నేహితురాలు సారా టెండూల్కర్‌తో కలిసి తప్పేంటి అంటూ కామెంట్లు చేశారు.
అద్భుతమైన మహేశ్వర్ యాత్ర
సచిన్ టెండూల్కర్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో కొన్ని అద్భుతమైన ఫోటోలను షేర్ చేస్తూ.. మధ్యప్రదేశ్‌ను 'అద్భుత భారతదేశం హృదయం' అని అభివర్ణించారు. "మహేశ్వర్".. ఇక్కడి సంస్కృతి, చరిత్ర, వారసత్వం, ఆతిథ్యం అన్నీ ఒకేచోట కనిపిస్తాయి. అహల్య కోట నుంచి ప్రశాంతమైన నర్మదా నది వరకు, ప్రతిదీ అద్భుతమే. కుటుంబంతో గడిపిన ఈ రోజులు నిజంగా మరపురానివి" అని ఆయన పోస్ట్ చేశారు. అహల్య కోట, ప్రశాంతమైన నర్మదా నది ఒడ్డున గడిపిన క్షణాలు తమకు ఎంతగానో నచ్చాయని సచిన్ పేర్కొన్నారు.

ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన సానియా చందోక్
ఈ పర్యటనలో అందరి దృష్టిని ఆకర్షించింది కాబోయే కోడలు సానియా చందోక్. ఎంగేజ్మెంట్ తర్వాత ఆమె సచిన్ కుటుంబంతో కలిసి పబ్లిక్‌గా కనిపించడం ఇదే మొదటిసారి. సానియా, సచిన్ కుమార్తె సారా టెండూల్కర్ మధ్య ఉన్న స్నేహం ఈ పర్యటనలో మరింత స్పష్టంగా కనిపించింది. గతంలో సారా తన స్నేహితురాలు సానియాతో కలిసి జైపూర్‌లో ఒక వివాహ వేడుకలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సారా "నా ప్లస్ వన్ ఎప్పటికీ" అని రాస్తూ సానియాతో ఉన్న ఫోటోను షేర్ చేశారు. ఈ ఘటనలు సానియా, సారా మధ్య ఉన్న బలమైన బంధాన్ని సూచిస్తున్నాయి.
మహేశ్వర్ చారిత్రక నేపథ్యం
నర్మదా నది ఒడ్డున ఉన్న మహేశ్వర్ పట్టణం ఒకప్పుడు మరాఠా రాణి అహల్యాబాయి హోల్కర్ రాజధానిగా ఉండేది. ఈ పట్టణం చారిత్రక, ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను కలిగి ఉంది. 1818లో రాజధాని ఇండోర్‌కు మారే వరకు, ఇది మాల్వాకు ప్రధాన కేంద్రంగా ఉండేది. పర్యటనలో భాగంగా సచిన్ కుటుంబం అహల్య కోట, ఘాట్‌లు, నర్మదా నదికి సంబంధించిన ప్రదేశాలను సందర్శించి ఆధ్యాత్మిక అనుభూతిని పొందారు. ఈ యాత్ర సచిన్ కుటుంబానికి మరపురాని జ్ఞాపకాలను మిగిల్చింది.