
హైదరాబాద్: తదుపరి దశాబ్దం పిల్లలు మరియు వారి కలల గురించి ఆలోచించాలని క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ అన్నాడు. కొత్త సంవత్సరాన్ని సచిన్ తనదైన శైలిలో స్వాగతించాడు. ఈ మేరకు తన ట్విట్టర్‌లో ఓ వీడియోని పోస్టు చేశాడు.
"ఈ స్ఫూర్తిదాయకమైన వీడియోతో మీ 2020ను ప్రారంభించండి. ఈ చిన్నారి మాడా రామ్ తన స్నేహితులతో కలిసి క్రికెట్ ఆడుతున్నాడు. ఇది నా హృదయాన్ని కదిలించింది. ఈ వీడియో మీ హృదయాన్ని కూడా కదిలించి ఉంటుందని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను" అని కామెంట్ పెట్టాడు.
దీంతో పాటు "2020తో పాటు వచ్చే దశాబ్దం పిల్లలకే అంకితం కావాలి. పెద్దలు చిన్నారులకు సమయం కేటాయించాలి. వారిపై ప్రేమ కురిపించాలి. వారి పొరపాట్లను మన్నించాలి. అదే సమయంలో వారు చేసిన తప్పులు పెద్ద నేరం ఏమీకాదని చెప్పాలి. ఇలా చేయడం ద్వారా పిల్లలు ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుంటారు" అని అన్నాడు.
"సరైన పద్ధతిలో పిల్లల ఆరోగ్యం, పౌష్టిక ఆహారం, విద్యలపై ఖర్చు చేస్తే వారు తమ కలలను సాకారం చేసుకుంటారు. వారు ఆడుకునే వాతావరణాన్ని సృష్టించే బాధ్యత కూడా తీసుకోవాలి. నిజంగా ఇది సమాజంపై సానుకూల ప్రభావం చూపిస్తుంది. క్రీడలు చిన్నారులను చురుగ్గా ఉంచుతాయి" అని సచిన్ పేర్కొన్నాడు.
"దీంతో పాటు వారు ఫిట్‌గా ఉండేందుకు దోహదపడుతుంది. ప్రతిగా చిన్నారుల్లో క్రీడా స్ఫూర్తి పెరుగుతుంది. సత్సంబంధాలు మెరుగవుతాయి. పెద్ద వాళ్లు కూడా తమలో ఉన్న పిల్లలను బయటకు తీసుకు రావాలి. తెలుసుకోవాలన్న కోరిక, ఉత్సాహం లాంటి లక్షణాలను చిన్నారుల నుంచి నేర్చుకోవాలి" అని సచిన్ తెలిపాడు.