సిడ్నీ: భారీ మాజీ కోచ్ గ్రేగ్ చాపెల్ బ్యాటింగ్ దిగ్గజం సచిన్ టెండూల్కర్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. సచిన్ టెండూల్కర్ కొన్ని సందర్భాల్లో మానసికంగా దుర్భలుడుగా కనిపిస్తాడని అన్నారు. ఇటీవల సచిన్ టెండూల్కర్ విడుదల చేసిన అతని ఆటో బయోగ్రఫీ 'ప్లేయింగ్ ఇన్ మై వే'లో గ్రేగ్ చాపెల్‌ను రింగ్ మాస్టర్‌గా అభివర్ణించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దానిపై చాపెల్ తాజాగా స్పందించారు.
ఫాక్స్ స్పోర్ట్స్ నిర్వహించిన ఓ కార్యక్రమంలో చాపెల్ మాట్లాడుతూ.. ఫాంలో లేని కారణంగా వెస్టిండీస్‌లో జరిగిన 2007 ప్రపంచ కప్ టోర్నీలో సచిన్ టెండూల్కర్‌ను బ్యాటింగ్ ఆర్డర్ మార్పు చేయాలని కోరానని తెలిపాడు.. దీంతో సచిన్ కొంత అసహనానికి గురయ్యాడని చెప్పాడు.
'టీంకు ఏది మంచిదైతే అతను అది చేస్తాడని నేను అనుకున్నా. కానీ, బ్యాటింగ్ ఆర్డర్‌ను మార్చుకునేందుకు సచిన్ అంగీకరించలేదు. దీంతోనే తామిద్దరి అగాథం ఏర్పడింది' అని చాపెల్ తెలిపాడు. అనాటి మెగా ఈవెంట్‌లో టీమిండియా నాకౌట్ దశలోనే వెనుదిరగాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెప్పాడు.

సచిన్ టెండూల్కర్ మొదట తన ప్రతిపాదనను అంగీకరించాడని, ఆ తర్వాత అతను మనసు మార్చుకున్నాడని చెప్పాడు. 'అతను ఓపెనింగ్ బ్యాటింగ్ చేయడానికే ప్రాధాన్యత ఇచ్చాడు. అయితే ప్రపంచ కప్ వెస్టిండీస్‌లో జరుగుతున్నందున అతను డౌన్ ఆర్డర్‌లో చేయాల్సింది' అని అన్నాడు. టాప్ ఆర్డర్‌లో బ్యాటింగ్ చేసేందుకు ఆటగాళ్లు ఉన్నారని చెప్పాడు.
'సచిన్ మొదట నా నిర్ణయానికి ఒప్పుకున్నాడు. ఆ తర్వాత అందుకు నిరాకరించాడు. నేను అతనిపై ఒత్తిడి పెంచడంతో.. నాతో పని చేయడానికి అనాటి నుంచి విముఖత చూపించాడు. అయితే అందుకు వేరేమార్గం చూశాను' అని చెప్పాడు. తాను సచిన్ స్థానంలో రాహుల్ ద్రావిడ్‌ను పంపాలనుకున్నట్లు చెప్పాడు.
కాగా, 'ప్రపంచ కప్ టోర్నీకి కొన్ని నెలల ముందు నన్ను కలిసేందుకు చాపెల్ మా ఇంటికి వచ్చాడు. రాహుల్ ద్రావిడ్ నుంచి కెప్టెన్సీ బాధ్యతలను నన్ను తీసుకోమన్నాడు. నాకు చాలా ఆశ్చర్యం వేసింది' అని సచిన్ టెండూల్కర్ తన పుస్తకంలో పేర్కొన్న విషయం తెలిసిందే.