
హైదరాబాద్: భారత మాజీ క్రికటర్, రాజ్యసభ సభ్యుడు సచిన్ టెండూల్కర్ మరో సెంచరీ చేయడానికి సిద్ధమయ్యాడు. ఈ సెంచరీ తన చిరకాల వాంఛ అని పేర్కొన్నాడు. ఆ సెంచరీ మరేదో కాదు. విద్యార్థుల పాఠ్యాంశాల్లో స్పోర్ట్స్‌ను తప్పనిసరి సబ్జెక్ట్ చేయాలని సూచిస్తున్నాడు. అంతేకాదు దానికి సంబంధించిన పుస్తకాన్ని కూడా సిద్ధం చేశాడు. ఇందులో టాప్ దిగ్గజాలైన 20మంది ఆటగాళ్ల జీవిత చరిత్రలున్నాయట.
యాబై ఐదు పేజీలున్న ఈ పుస్తకంలో మరపురాని క్రీడా దిగ్గజాల జీవిత చరిత్రలుండబోతున్నాయట. వాటిలో ధ్యాన్ చంద్, మిల్కా సింగ్, ప్రకాశ్ పదుకొనే. అజిత్ వాదెకర్, పీకె బెనర్జీ, మేరీ కోమ్ మొదలైనవారి జీవితాలను పొందుపరిచారట. మానవ వనరుల శాఖ ఇప్పటికే ఈ అంశం గురించి చర్చిస్తుందని త్వరలోనే ఆమోదించనుందని ఆయన వెల్లడించాడు.
నా అభిమానుల్లో ఎక్కువశాతం మంది కొత్తగా తల్లిదండ్రులైన వారే ఉన్నారు. ఈ పుస్తకంలోని జీవిత చరిత్రలు వారి మనసులను కదిలిస్తాయనుకుంటాను. వాళ్లు ప్రేరణ పొందితే వారి పిల్లలను కూడా పాఠశాలల్లో క్రీడలపై ఆసక్తి చూపేందుకు ప్రోత్సహిస్తున్నానుకుంటాను. అని సచిన్ తన నమ్మకాన్ని వెలిబుచ్చాడు.
2030 సంవత్సరం కల్లా భారతదేశం సుసంపన్న దేశం కాబోతుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశాడు. ఈ నేపథ్యంలో అందరూ కేవలం చదువు మీదే ధ్యాస పెట్టకుండా క్రీడలపైనా ఆసక్తి చూపుతారని ఆశిస్తున్నట్లు తెలిపాడు. ఈ పుస్తకం విద్యార్థుల సిలబస్‌లో ఓ భాగమైతే వారి జీవితాల్లో కూడా మార్పులొస్తాయని పేర్కొన్నాడు.
ట్విట్టర్ ఫాలోవర్ల జాబితాలో సచిన్ 21.7మిలియన్ ఫాలోవర్లను సంపాదించుకున్నాడు. ఎక్కువ మంది ఫాలోవర్లున్న జాబితాలో టెండూల్కర్ 8వ స్థానంలో ఉండగా, విరాట్ కోహ్లీ 10వ స్థానంలో ఉన్నాడు. వీరి కంటే ఎక్కువ ఫాలోవర్లున్న వ్యక్తిగా ప్రధాని నరేంద్ర మోడీ (37.5మిలియన్లు), తర్వాతి స్థానంలో అమితాబ్ బచ్చన్ (31.5 మిలియన్లు) ఉన్నారు.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.