న్యూఢిల్లీ : టీమ్ ఇండియా కోచ్ పదవికి సంబంధించి నిత్యం ఏదో ఒక వార్త చర్చల్లో నానుతూనే ఉంది. తాజాగా టీమ్ ఇండియా బౌలింగ్ కోచ్ కు సంబంధించి మాజీ కెప్టెన్, అడ్వైజరీ కమిటీ సభ్యుడు గంగూలీ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.
కోచ్ ఎంపిక నిమిత్తం సచిన్, గంగూలీ, లక్ష్మణ్ లతో కూడిన త్రిసభ్య కమిటీని బీసీసీఐ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. అయితే గురువారం నాడు 44 వ వడిలోకి అడుగుపెట్టిన గంగూలీ కోచ్ ఎంపికపై స్పందిస్తూ.. బౌలింగ్ కోచ్ ఎంపిక విషయంలో సచిన్, లక్ష్మణ్ ల ప్రమేయం ఏమి లేదన్నాడు.

ఇక ప్రస్తుతం టీమ్ ఇండియా వెస్టిండీస్ పర్యటన గురించి ప్రస్తావిస్తూ.. బౌలింగ్ కోచ్ ను తనతో పాటు విండిస్ టూర్ కు తీసుకెళ్లవద్దనేది కుంబ్లే నిర్ణయమేనని చెప్పుకొచ్చాడు. అలాగే కుంబ్లే బౌలర్ అయినప్పటికీ బౌలింగ్ కోచ్ గా కాకుండా ప్రధాన కోచ్ గా అతన్ని నియమించడం గురించి స్పందించిన గంగూలీ, తర్వాతి రోజుల్లో కుంబ్లే పేస్ బౌలింగ్ బాధ్యతలు కూడా చేపట్టబోతున్నట్టుగా వార్తా పత్రికల్లో చదివానన్నాడు. ప్రధాన్ కోచ్ గా ఉన్న కుంబ్లే కింద బౌలింగ్ కోచ్ ను ఎంపిక చేయకపోవడం పట్ల సచిన్, లక్ష్మణ్ ల ప్రమేయమేమి లేదన్నాడు గంగూలీ.
కాగా, టీమ్ ఇండియా కోచ్ పదవి కోసం పోటి పడ్డ రవిశాస్త్రికి బ్యాటింగ్ కోచ్ బాధ్యతలను ఆఫర్ చేసినట్టుగా చెప్పుకొచ్చాడు గంగూలీ. అయితే తనకంటే జూనియర్ అయిన కుంబ్లే ప్రధాన కోచ్ గా ఉండగా, తాను బ్యాటింగ్ కోచ్ గా ఉండడాన్ని తక్కువగా భావించిన రవిశాస్త్రి త్రిసభ్య కమిటీ ఆఫర్ ను తిరస్కరించినట్టుగా గంగూలీ వెల్లడించాడు.