వారణాసిలో శివుని థీమ్‌లో నిర్మించే క్రికెట్ స్టేడియానికి ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు. ఈ స్టేడియం కోసం రూ.451 కోట్లు ఖర్చు అవుతాయని అంచనా. స్టేడియం కోసం రూ.121 కోట్ల విలువైన స్థలాన్ని సేకరిస్తారు. దీనిపై రూ.330 కోట్ల వ్యయంతో స్టేడియం నిర్మించనున్నారు. మొత్తం 30 వేల మంది ప్రేక్షకుల కెపాసిటీతో దీన్ని నిర్మిస్తారని తెలుస్తోంది.
అర్థచంద్రాకారపు రూఫ్ కవర్స్, త్రిశూలం ఆకారంలో ఉండే ఫ్లడ్ లైట్లు వంటి శివుడికి సంబంధించిన వస్తువులు ప్రతిబింబించేలా ఈ స్టేడియం నిర్మించనున్నారు. కాశీ గొప్పదనాన్ని వివరించేలా స్టేడియాన్ని డిజైన్ చేశారు. ప్రేక్షకులు కూర్చునే గ్యాలరీ అంతా కూడా కాశీలోని ఘాట్స్‌లోని మెట్లలా డిజైన్ చేసినట్లు సమాచారం. ఈ స్టేడియం నిర్మాణం 2025 డిసెంబరు నాటికి పూర్తవుతుంది.

ఈ స్టేడియం శంకుస్థాపన తర్వాత ప్రజలను ఉద్దేశించి మోదీ ప్రసంగించారు. ఈ కార్యక్రమానికి బీసీసీఐ ప్రెసిడెంట్ రోజర్ బిన్నీ, వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా, సెక్రటరీ జై షా తదితరులు హాజరయ్యారు. ఇది కాశీ చరిత్రలో కొత్త స్వర్ణ అధ్యాయమని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ అన్నారు. అలాగే మరికొన్ని కార్యక్రమాలు కూడా తాము మొదలు పెడతామని సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు.
క్రికెట్ దేవుడిగా ఫ్యాన్స్ పిలుచుకునే సచిన్ టెండూల్కర్ కూడా ఈ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నాడు. ఇక్కడకు వచ్చే ముందే కాశీ విశ్వనాథుడి ఆలయానికి వెళ్లిన సచిన్ టెండూల్కర్.. ఇక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించాడు. అనంతరం స్టేడియం శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నాడు. ఈ సమయంలో మోదీతో కలిసి సచిన్ ఉన్న ఫొటోలు వైరల్ అవుతున్నాయి.

కాశీలో నిర్మిస్తున్న ఈ స్టేడియం యూపీలోని మూడో అంతర్జాతీయ స్టేడియం. ఇప్పటికే ఇక్కడ కాన్పూర్. లక్నోల్లో క్రికెట్ స్టేడియాలు ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు కాశీలో మరో అంతర్జాతీయ స్టేడియం నిర్మిస్తున్నారు. ఈ స్టేడియం డిజైన్‌లను సోషల్ మీడియాలో పంచుకోగా ఫ్యాన్స్ వాటిని తెగ మెచ్చుకుంటున్నారు.