రియో డీ జనీరో: రియో ఒలింపిక్స్ గుడ్‌విల్ అంబాసిడర్లలో ఒకరైన క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ భారత అథ్లెట్లను చీర్ చేశాడు. ఒలింపిక్స్ విలేజ్‌కు వెళ్లిన అతడు కాసేపు అథ్లెట్లతో మాట్లాడి, వారికి గుడ్‌లక్ చెప్పాడు. 1998 కామన్వెల్త్ గేమ్స్‌లో భారత క్రికెట్ జట్టు తరఫున ఆడిన సచిన్.. ఒలింపిక్స్ విలేజ్‌లో అడుగుపెట్టగానే మళ్లీ ఆనాటి జ్ఞాపకాలు గుర్తొచ్చాయని మీడియాకు తెలిపాడు.
'క్రీడా గ్రామంలో ఉన్నందుకు చాలా గొప్పగా అనిపిస్తోంది. భారత క్రికెట్ జట్టు సభ్యుడిగా 1998 కామన్వెల్త్ క్రీడల గ్రామం (కౌలాలంపూర్)లో గడిపిన క్షణాలు గుర్తుకొస్తున్నాయి' అని పేర్కొన్నాడు.

'ఒలింపిక్ క్రీడల్లో నేను నిపుణుడిని కాదు. కాబట్టి పోటీల్లో ఎలా గెలవాలనే అంశంపై మన అథ్లెట్లకు నేనెప్పుడూ సలహాలివ్వను. ఎవరికివాళ్లు విజేతలే. మెరుగైన ప్రదర్శన కోసం ఏం చేయాలో వాళ్లకు తెలుసు' అని సచిన్ తెలిపాడు. దేశమంతా మీ వెంట ఉందని చెప్పి వారిలో ఉత్సాహం మాత్రం నింపానని చెప్పాడు.
ఒలింపిక్ ఆటల్లో టెన్నిస్, టేబుల్ టెన్నిస్ అంటే తనకు చాలా ఇష్టమని సచిన్ చెప్పాడు. అథ్లెటిక్స్ కూడా ఫాలో అవుతానని సచిన్ అన్నాడు. ఈ గేమ్స్‌లో భారత్ కచ్చితంగా ఇన్ని మెడల్స్ గెలుస్తుందని తాను చెప్పలేనని, అయితే సాధ్యమైనన్ని ఎక్కువ పతకాలు వస్తాయన్న నమ్మకం ఉందన్నాడు. కాగా, మరో రెండు రోజుల్లో రియో నుంచి తిరిగి వచ్చేయనున్నాడు సచిన్.