న్యూఢిల్లీ: మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్, వినోద్ కాంబ్లి మంచి స్నేహితులని క్రికెట్ అభిమానులందరికీ తెలిసిన విషయమే. అయితే ప్రస్తుతం వీరిద్దరూ స్నేహ బంధానికి దూరమైనట్లు సమాచారం. కాగా తాము ప్రస్తుతం శత్రువులుగా మారినట్లు అందరూ భావిస్తున్నారని మాస్టర్ స్నేహితుడు వినోద్ కాంబ్లి తెలిపారు. చిన్నతనం నుంచే మంచి స్నేహితులుగా ఉన్న సచిన్ టెండూల్కర్, వినోద్ కాంబ్లీలు, పాఠశాల స్థాయిలో 664 పరుగుల భాగస్వామ్యంతో ఓ రికార్డును కూడా నెలకొల్పారు.
సచిన్, కాంబ్లీ ఈ టోర్నమెంటులో శారదాశ్రం విద్యా మందిర్ తరపున ఆడారు. తర్వాత వారిద్దరూ కలిసి భారత జాతీయ జట్టు తరపున కూడా ఆడారు. 24ఏళ్ళ పాటు క్రికెట్ జీవితాన్ని కొనసాగించిన మాస్టర్ సచిన్ టెండూల్కర్ గత వారం అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకున్న విషయం తెలిసిందె. అయితే ముంబైలోని వాంఖేడే స్టేడియంలో జరిగిన మాస్టర్ 200వ టెస్ట్ మ్యాచును వీక్షించేందుకు ఎందరో ప్రముఖులు వచ్చినప్పటికీ చిన్ననాటి మిత్రుడు వినోద్ కాంబ్లీ మాత్రం హాజరు కాలేదు.

సచిన్ టెండూల్కర్ కుటుంబసభ్యులు, పలువురు ప్రముఖులు, క్రికెట్ సహచరులు సచిన్ చివరి మ్యాచును ప్రత్యక్షంగా వీక్షించారు. కానీ కాంబ్లీ మాత్రం ఆ టెస్ట్ మ్యాచును వీక్షించేందుకు స్టేడియానికి రాలేదు. దీనిపై వినోద్ కాంబ్లిని మీడియా ప్రశ్నించగా.. సచిన్ టెండూల్కర్‌ను గత ఏడు సంవత్సరాలుగా కలవలేదని సమాధానమిచ్చారు. సచిన్ పేరును చాలా కాలం నుంచి వినలేదని, అది తనకు బాధ కలిగిస్తుందని కాంబ్లి చెప్పారు.
గత ఏడు సంవత్సాల నుంచి ఒకరికొకరం కలుసుకోలేదని తెలిపారు. కొన్ని సందేశాలను మాత్రమే పంచుకున్నామని కాంబ్లి చెప్పారు. ఇవన్నీ చూస్తుంటే తామిద్దరం శత్రువులుగా మారినట్లు అనిపిస్తుందని ఆయన అన్నారు. అయితే తాను సచిన్ టెండూల్కర్ మ్యాచును టివిలో వీక్షించానని, అందరి అభిమానుల్లాగే సచిన్ చివరి మ్యాచ్ అని తలచుకుంటే తనకు బాధ కలిగిందని తెలిపారు. తన స్నేహితుడు సచిన్ మ్యాచ్ అనంతరం కన్నీటితో మైదానాన్ని వీడుతుంటే తన కళ్ళల్లో నీళ్ళు తిరిగాయని వినోద్ చెప్పారు.
ఒక స్నేహితునిగా, క్రికెటర్‌గా సచిన్ టెండూల్కర్‌కు తన మద్దతు ఎప్పుడూ ఉంటుందని కాంబ్లి చెప్పారు. అతని గురించి ఎప్పుడూ తప్పుగా మాట్లాడలేదని అన్నారు. సచిన్ తనకు ఎప్పుడూ స్నేహితుడేనని ఆయన అన్నారు. మళ్లీ తాము స్నేహితులుగా కలుసుకుంటామని తెలిపారు. గతంలో చాలా జ్ఞాపకాలను సచిన్‌తో పంచుకున్నట్లు తెలిపారు. తామిద్దరం కలిసి క్రికెట్ ఆడామని, 30ఏళ్లుగా తమ స్నేహం ఆనందంగా గడిచిందని, ఇప్పటికీ సచిన్ నుంచి ఒక ఫోన్ కాల్ వస్తే అతన్ని కలుసుకుంటానని, మళ్లీ పాత స్నేహాన్ని కొనసాగిస్తానని, అతనికి ఎప్పుడూ మద్దతుగానే ఉంటానని కాంబ్లి చెప్పారు.