
హైదరాబాద్: క్రికెట్ అసోసియేషన్ ఫర్ ద బ్లైండ్ ఇన్ ఇండియా (సీఏబీఐ)ను గుర్తించాలని క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ)ని అభ్యర్ధించాడు. ఈ మేరకు వినోద్ రాయ్ నేతృత్వంలోని బీసీసీఐ పాలకుల కమిటీకి సచిన్ టెండూల్కర్ లేఖ రాశాడు.
భారత అంధుల క్రికెట్ అసోసియేషన్‌ను గుర్తించాలని బోర్డు పెన్షన్ పథకం కిందకు ఆటగాళ్లను తీసుకురావాలని సచిన్ సూచించాడు. 'అంధుల వరల్డ్ కప్‌లో భారత్ వరుసగా రెండోసారి సాధించిన విజయాన్ని మనం సెలబ్రేట్ చేసుకున్నాం. ఈ సందర్భంగా మీకు ఒక విన్నపం. సీఏబీఐను బీసీసీఐ పరిధిలోకి తీసుకోండి' అని లేఖలో సచిన్ పేర్కొన్నాడు.
అంధుల క్రికెట్‌లో భారత క్రికెటర్లు సాధిస్తున్న విజయాలను చూసి మిగతా వారిని ఫాలో అవ్వాలని సచిన్ ఈ సందర్భంగా పేర్కొన్నాడు. ఈ ఏడాది ప్రారంభంలో షార్జా వేదికగా జరిగిన అంధుల వరల్డ్ కప్‌లో భారత్ వరుసగా నాలుగోసారి వరల్డ్ కప్ నెగ్గిన సంగతి తెలిసిందే. జనవరి 20న జరిగిన ఫైనల్లో పాకిస్థాన్‌పై 2 వికెట్ల తేడాతో భారత్ విజయం సాధించిన సంగతి తెలిసిందే.
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత్ తొలుత పాకిస్థాన్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. దీంతో నిర్ణీత 40 ఓవర్లలో పాకిస్థాన్ 8 వికెట్ల నష్టానికి 308 పరుగులు చేసింది. అనంతరం భారత్ 38.2 ఓవర్లలో 8 వికెట్లు నష్టపోయి లక్ష్యాన్ని ఛేదించింది. వరల్డ్ కప్ అనంతరం భారత్ చేరుకున్న ఆటగాళ్లను అటు ప్రభుత్వం, ఇటు బీసీసీఐ గుర్తించలేదు.
'అంధుల క్రికెట్‌లో రాణిస్తోన్న ఆటగాళ్లకు బీసీసీఐ మద్దతుగా నిలిస్తే అద్భుత ఫలితాలు సాధిస్తారు. వారు సాధించిన విజయాలను మనం స్ఫూర్తిగా తీసుకోవాలి. రాబోయే రోజుల్లో అంధుల క్రికెట్ విస్తరిస్తుంది. ఈ ఛాంపియన్లను బీసీసీఐ పెన్షన్ స్కీం కిందకు చేరిస్తే వారికి సుదీర్ఘమైన ఫైనాన్షియల్ సపోర్ట్ ఇచ్చినట్లు అవుతుంది' అని సచిన్ పేర్కొన్నాడు.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.