లండన్: క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన తర్వాత కూడా గాయాల బెడద తప్పట్లేదు. గత కొన్ని రోజులుగా లండన్‌లో విహారయాత్రకు వెళ్లిన సచిన్ టెండూల్కర్ తన ఎడమ మోకాలికి శస్త్రచికిత్స చేయించుకున్నట్లు సోషల్ మీడియా ద్వారా అభిమానులకు తెలియజేశాడు.

దీనికి సంబంధించి కాలికి నలుపు రంగు బ్యాండేజీతో ఆసుపత్రిలో ఉన్న ఫోటోను సచిన్ తన ఫేస్‌బుక్ పేజీలో పోస్ట్ చేశాడు. 'రిటైర్మెంట్ అయిన తర్వాత కూడా కొన్ని గాయాలు ఇబ్బంది పెడుతూనే ఉంటాయి. ప్రస్తుతానికి మోకాలికి శస్త్రచికిత్స జరగడంతో విశ్రాంతి తీసుకుంటున్నా. అతి త్వరలోనే కోలుకుని రోజువారీ పనుల్లో నిమగ్నమవుతానన్న నమ్మకముంద'ని సచిన్ పోస్ట్ చేశాడు.