హైదరాబాద్: అంతర్జాతీయ క్రికెట్‌లో పరిచయం అక్కర్లేని పేరు సచిన్ రమేశ్ టెండూల్కర్. క్రికెట్ లెజెండ్‌గా కీర్తించబడే సచిన్ తన 24 ఏళ్ల సుదీర్ఘ క్రికెట్ కెరీర్‌లో ఎన్నో ఘనమైన రికార్డలను తన పేరిట లిఖించుకున్నాడు. సచిన్ టెండూల్కర్ సాధించిన రికార్డులను ఇప్పట్లో ఎవరూ అధిగమించలేరని అంతా అనుకున్నారు.
అయితే ఆ భావన తప్పుని ఇప్పుడు క్రీడా పండితులు విశ్లేషిస్తున్నారు. ఆదివారం కొలంబో వేదికగా ఆతిథ్య శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో కెప్టెన్ విరాట్ కోహ్లీ మ్యాచ్‌ని చూస్తే అతి త్వరలోనే సచిన్ రికార్డలను దాటేస్తాడని చెబుతున్నారు. ఈ మ్యాచ్‌లో కోహ్లీ 116 బంతుల్లో 110 పరుగులు చేసి విజయంలో కీలకపాత్ర పోషించాడు.

ఈ క్రమంలో తన కెరీర్‌లో 30వ సెంచరీని నమోదు చేశాడు. సచిన్ టెండూల్కర్ 280వ వన్డేలో 30వ సెంచరీని నమోదు చేస్తే, విరాట్ కోహ్లీ 194వ వన్డేలోనే ఈ ఘనతను సాధించడం విశేషం. 2001లో దక్షిణాఫ్రికాతో జోహెన్స్ బర్గ్‌లో జరిగిన మ్యాచ్‌లో సచిన్ తన 30వ సెంచరీని నమోదుచేశాడు.
30 సెంచరీలను సాధించడానికి సచిన్‌కు 267 ఇన్నింగ్స్‌లు అవసరం కాగా, కోహ్లీకి 186 ఇన్నింగ్స్ అవసరమయ్యాయి. దీనిని బట్టి చూస్తుంటే 30 సెంచరీలు సాధించడానికి కోహ్లీతో పోలిస్తే సచిన్ టెండూల్కర్ అత్యధికంగా 81 ఇన్నింగ్స్‌లు తీసుకోవడం విశేషం. అంతేకాదు 16 ఏళ్ల తర్వాత ఈ రికార్డుని కోహ్లీ చేరుకున్నాడు.
ఇప్పటి వరకు వన్డేల్లో అత్యధిక సెంచరీలు సాధించిన వారిలో కోహ్లీ, ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు పాంటింగ్‌తో కలిసి రెండో స్థానంలో ఉండగా, సచిన్ 49 వన్డే సెంచరీలతో అగ్రస్థానంలో ఉన్నాడు. కోహ్లీ గత కొంత కాలంగా అద్భుతమైన ఆటతీరుతో టీమిండియాకు విజయాలు అందిస్తున్న సంగతి తెలిసిందే.