
హైదరాబాద్: స్వదేశీ, విదేశీ పిచ్‌ల స్వభావాన్ని అర్థం చేసుకుని టీమిండియా టెస్టులు ఆడాలని క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ సూచించారు. సెంచూరియన్‌లోని సూపర్ స్పోర్ట్ పార్క్ మైదానంలో శనివారం భారత్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య రెండో టెస్టు మ్యాచ్ ప్రారంభమైంది. ఈ టెస్టు సిరీస్‌లో గెలవాలంటే భారత్ ఈ మ్యాచ్‌ను తప్పనిసరిగా గెలవాలి.
ఈ నేపథ్యంలో సచిన్ టీమిండియాకు కొన్ని సూచనలు చేశాడు. 'టెస్టు క్రికెట్ అనేది అర్థం చేసుకుని స్థానిక పరిస్థితులకి అనుగుణంగా ఆడేది. భారత్ పిచ్‌లతో పోలిస్తే.. విదేశీ పిచ్‌లు పూర్తి భిన్నం. భారత్ గడ్డపై అయితే.. బౌలర్లకి 20 ఓవర్ల తర్వాతే పిచ్ నుంచి సహకారం లభిస్తుంది. రివర్స్ స్వింగ్‌కి అవకాశం దొరుకుతుంది. కానీ.. దక్షిణాఫ్రికా లాంటి పిచ్‌లపై అది పూర్తిగా రివర్స్. మొదటి 25 ఓవర్లు ఫాస్ట్ బౌలర్లకి స్వర్గధామం. కాబట్టి దాన్ని అర్థం చేసుకుని.. భారత్‌లో ఆడినట్లు బ్యాట్స్‌మెన్ ఆరంభంలోనే స్ట్రోక్స్ ఆడేందుకు ప్రయత్నించకూడదు' అని సచిన్ అన్నాడు.
వాస్తవానికి రెండో టెస్టులో గెలవడానికి భారత్‌కు మెరుగైన అవకాశాలున్నాయని.. ఈ మ్యాచ్ టీమిండియాకు ఓ పరీక్షలాంటిదని సచిన్ చెప్పుకొచ్చాడు. 'కేప్‌టౌన్ టెస్టులో ఓటమి భారత ఆటగాళ్ల మానసిక స్థైర్యాన్ని కోల్పోయేలా చేస్తుందని నేను భావించను. రెండో టెస్టులో భారత ఆటగాళ్లు మైదానంలో ఎలా ఆడతారన్నదే ముఖ్యం. ఈ టెస్టు సిరీస్‌లో అశ్విన్ లాంటి స్పిన్నర్లు కచ్చితంగా ప్రధాన పాత్ర పోషిస్తారు' అని సచిన్ అన్నాడు.
'మొదటి టెస్టులో హర్దిక్ పాండ్య ఒక్కడే దక్షిణాఫ్రికా బౌలర్లను సమర్థంగా ఎదుర్కొన్నాడు. భారత ఆటగాళ్లు నిలకడైన భాగస్వామ్యాలు నెలకొల్పడంలో విఫలమయ్యారు. తొలి 25 ఓవర్లు నిలకడగా ఆడి ఉంటే కేప్‌టౌన్ టెస్టు ఫలితం మరోలా ఉండేది. కేప్‌టౌన్‌లో భారత ఓపికతో ఆడి ఉంటే 50 నుంచి 80 ఓవర్ల మధ్య అత్యధిక పరుగులు వచ్చేవి' అని సచిన్ తెలిపాడు.
'సెంచూరియన్ టెస్టు మ్యాచ్‌లోనైనా కొత్త బంతి వచ్చే వరకు ఓపెనర్లు బాధ్యతగా ఆడాలి. భారత బ్యాట్స్‌మెన్ తొలి 25 ఓవర్ల పాటు నిలకడగా ఆడాలి. 50 ఓవర్ల తర్వాత పరుగులు తీయడంలో వేగం పెంచాలి. ఇక, బౌలర్ల విషయానికి వస్తే సరైన విధంగా బౌలింగ్ చేయాలి' అని సచిన్ సూచన చేశాడు.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.