
ముంబై: భారత క్రికెట్‌లోని అత్యుత్తమ పేసర్లలో జహీర్ ఖాన్ ఒకడు. తనదైన పేస్, స్వింగ్‌తో టీమిండియాకు ఎన్నో చిరస్మరణీయ విజయాలు అందించాడు. 300 వికెట్లు తీసిన నాలుగో భారతీయుడిగా చరిత్ర పుటల్లో నిలిచాడు. అనిల్ కుంబ్లే (619), కపిల్ దేవ్ (434), హర్భజన్ సింగ్ (413) మాత్రమే జహీర్ కంటే ముందున్నారు. బౌలింగ్‌లో మరెవరికి తీసిపోని జహీర్.. ఫీల్డింగ్‌లో మాత్రం అంతగా రాణించలేదు. అయితే క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్.. జహీర్ ఇటీవల ఓ అద్భుత క్యాచ్ పట్టాడు అంటూ తన యూట్యూబ్ చానెల్‌లో పేర్కొన్నాడు.
రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్‌లో భాగంగా గత ఇటీవల ముంబైలోని వాంఖడే స్టేడియంలో వెస్టిండీస్ లెజెండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో జహీర్ ఖాన్ కళ్లు చెదిరే క్యాచ్ పట్టాడని సచిన్ తెలిపాడు. యూట్యూబ్ చానెల్‌లో సచిన్ మాట్లాడుతూ... 'విండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇన్నింగ్స్ 14-15 ఓవర్ అనుకుంటా. క్రీజులో రికార్డో పావెల్ భారీ షాట్‌కు ప్రయత్నించాడు. ఇన్నర్ సర్కిల్‌లో ఫీల్డింగ్ చేస్తున్న జహీర్ క్యాచ్‌ను అంచనా వేయలేకపోయాడు' అని అన్నాడు.
'షార్ట్ ఫైన్‌లో ఉన్న నేను.. జహీర్ వెనుకకు వెళ్లు అంటూ అరిచాను. కానీ.. మైదానంలో ఉన్న అభిమానుల అల్లరితో అతనికి సరిగ్గా వినబడ లేదు. పావెల్ బలమేంటో నాకు తెలిసి కాబట్టి.. జహీర్‌ను అలర్ట్ చేశాను. ఓ దశలో ఇక క్యాచ్ కష్టమే అనుకున్నాను. కానీ.. జహీర్ వెనుకకు పరిగెడుతూ క్యాచ్ పట్టుకోవడంతో ఒక్కసారిగా ఆశ్చర్యపోయాను. దగ్గరికి వెళ్లి ప్రశంసించా. నీ క్రికెట్ కెరీర్‌లో అత్యుత్తమ క్యాచ్ ఇదే జహీర్ అని చెప్పా' అని సచిన్ తెలిపాడు.
మహ్మద్ కైఫ్ ఇప్పటికి అత్యుత్తమ ఫిట్‌నెస్ కల్గిన క్రికెటర్ అని సచిన్ కితాబిచ్చాడు. బాయ్ సాబ్ (కైఫ్) తర్వాత జట్టులో చురుకైన ఫీల్డర్ అంటే.. మునాఫ్ పటేల్ అని సచిన్ పేర్కొన్నాడు. రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్ తొలి మ్యాచ్‌లో వెస్టిండీస్ లెజెండ్‌పై ఇండియా లెజెండ్స్ ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఓపెనర్లు వీరేందర్ సెహ్వాగ్, సచిన్ టెండూల్కర్ 83 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఆ తర్వాత యువరాజ్ సింగ్, మహ్మద్ కైఫ్ 151 పరుగుల లక్ష్యాన్ని ఛేదించారు. కరోనా వైరస్ కారణంగా రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్ వాయిదా పడిన విషయం తెలిసిందే.