
భారత్ క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ టెండూల్కర్‌ను ఈ సారి మెగా వేలంలో ముంబై ఇండియన్స్ కొనుగోలు చేసింది. 20 లక్షల రూపాయల కనీస ధరతో వేలంలోకి వచ్చిన అర్జున్‌ను 30 లక్షల రూపాయలకు ముంబై దక్కించుకుంది. కాగా గతేడాది వేలంలో కూడా అర్జున్‌ను ముంబై ఇండియన్సే కొనుగోలు చేసింది. 20 లక్షల రూపాయల బేస్ ప్రైజ్ ధరకు కొనుగోలు చేసినప్పటికీ ఒక్క మ్యాచ్‌లోనూ ఆడించలేదు. అయితే తాజాగా తన కొడుకు అర్జున్ టెండూల్కర్ ఆట గురించి సచిన్ టెండూల్కర్ ఆసక్తికర విషయాలను వెల్లడించారు. తల్లిదండ్రులు వారి పిల్లలు ఆడే ఆటను చూస్తే వారు ఒత్తిడికి గురవుతారని చెప్పిన సచిన్.. అందుకే తాను అర్జున్ ఆడే మ్యాచ్‌లను చూడడానికి వెళ్లను అని చెప్పారు. ఎందుకంటే అర్జున్ స్వేచ్ఛగా క్రికెట్ ఆడాలని తాను కోరుకుంటానని తెలిపారు. అతను ఏం కావాలనుకుంటున్నాడో దానిని సాధించడంపై దృష్టి పెట్టాలని తాను కోరుకుంటున్నట్టు ఆయన తెలిపారు. అందుకే అర్జున్ ఆటను చూడడానికి తాను వెళ్లనని సచిన్ వివరించారు.
''అర్జున్ ఆట మీద దృష్టి పెట్టాలి. నేను క్రికెట్ ఆడే రోజుల్లో కూడా నన్ను ఎవరైనా చూసిన నాకు నచ్చేది కాదు. నేను వెళ్లి అర్జున్ ఆటను చూసినా అతనికి తెలియకుండా ఎక్కడో దాక్కుంటాను. నేను ఉన్నానని అతనికి తెలియనవ్వను. అర్జున్‌కే కాదు ఎవరికీ తెలియనివ్వను. అర్జున్ కోచ్ అయినా, ఇంకేవరైనా సరే వారి కంటపడను. అలా అతనికి తెలియకుండానే అతని ఆటను చూస్తాను "అని సచిన్ టెండూల్కర్ చెప్పాడు. దీనిని బట్టి సచిన్ టెండూల్కర్ ఇప్పటివరకు తన కొడుకు అర్జున్ టెండూల్కర్ ఆటను చూడలేదని అర్థం చేసుకోవచ్చు. సచిన్ కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేశాడు.
కాగా 22 ఏళ్ల పేస్ ఆల్‌రౌండర్ అయినా అర్జున్ టెండూల్కర్ ఇప్పటివరకు అనేక దేశవాళీ టోర్నమెంట్లు ఆడాడు. ఎడమ చేతి బౌలర్, బ్యాటర్‌గా సత్తా చాటే ప్రయత్నం చేస్తున్నాడు. గతేడాది దేశవాళీ లీగ్ అయినా సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో హర్యానాతో జరిగిన మ్యాచ్‌లో ముంబై తరఫున బరిలోకి దిగాడు. మూడు ఓవర్లలో 34 పరుగులిచ్చి ఒక వికెట్ తీశాడు. అలాగే అర్జున్ టెండూల్కర్‌ను ముంబై ఇండియన్స్ కొనుగోలుపై ఆ జట్టు డైరెక్టర్ జహీర్ ఖాన్ స్పందించాడు. అర్జున్‌లో భిన్నమైన ఆట ఉందని తెలిపాడు. పైగా ఈ సారి తమ జట్టులో ఎక్కువ లెఫ్ట్ ఆర్మ్ బౌలర్లకు అవకాశం ఇస్తున్నట్లు వెల్లడించాడు. ఈ సారి తమ స్క్వాడ్‌లో నలుగురు లెఫ్ట్ ఆర్మ్ పేస్ బౌలర్లు ఉన్నారని తెలిపాడు.