Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

రహానెది తెలివైన బుర్ర.. జట్టును అద్భుతంగా నడిపించగలడు: క్రికెట్ దిగ్గజం

Sachin Tendulkar says Ajinkya Rahane has a good cricketing brain

ముంబై: టీమిండియా టెస్ట్ జట్టు వైస్‌ కెప్టెన్‌ అజింక్య రహానెది తెలివైన బుర్ర అని క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్ పేర్కొన్నారు. దూకుడుకు మారుపేరైన రహానె ఆస్ట్రేలియాతో జరిగే చివరి మూడు టెస్టుల్లో జట్టును అద్భుతంగా నడిపించగలడని సచిన్ ధీమా వ్యక్తం చేశారు. తొలి టెస్టు తర్వాత భారత కెప్టెన్ విరాట్‌ కోహ్లీ ఇండియా రానున్నాడు. కోహ్లీ సతీమణి అనుష్క శర్మ జనవరిలో బిడ్డకు జన్మనివ్వనున్న నేపథ్యంలో.. ప్రసవ సమయంలో ఆమె చెంత ఉండేందుకు అతడు పితృత్వపు సెలవులు తీసుకున్నాడు. దాంతో మిగిలిన మూడు టెస్టుల్లో భారత జట్టును రహానె నడిపించనున్నాడు.

'అజింక్య రహానెతో మాట్లాడాను. అతడిది తెలివైన బుర్ర. పైగా స్థిత ప్రజ్ఞతతో ఉంటాడు' అని సచిన్ టెండూల్కర్‌ అన్నారు. పెద్ద సిరీసులకు ముందు రహానె సన్నద్ధత, తీవ్రత తనను ఆకట్టుకుంటాయని క్రికెట్ దిగ్గజం చెప్పారు. 'రహానెదీ దూకుడు తత్వమే. కానీ ఎంతో నియంత్రణతో ఉంటాడు. అతడితో గడిపిన సమయాన్ని బట్టి జింక్స్‌ కష్టపడే ఆటగాడని చెప్పగలను. జింక్స్‌ దేనికైనా వెనకాడడు. నిజంగా చెమటోడిస్తే, సన్నద్ధతలో నిజాయతీ ఉంటే ఫలితం మనకు అనుకూలంగానే వస్తుంది' అని సచిన్‌ తెలిపారు.

సరైన ప్రక్రియను అనుసరిస్తే ఫలితం తప్పకుండా వస్తుందని సచిన్ టెండూల్కర్‌ ‌పేర్కొన్నారు. 'తమ అత్యుత్తమ సామర్థ్యం మేరకు జట్టు ఆటగాళ్లంతా సన్నద్ధమయ్యారనే చెప్పగలను. ఫలితంపై దృష్టి పెట్టకూడదు. ప్రక్రియపై మాత్రమే దృష్టి సారించాలి. అప్పుడు ఫలితమే మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది' అని లిటిల్ మాస్టర్ సూచించారు. రహానె ప్రస్తుతం భారత్ తరఫున కేవలం టెస్టుల్లో మాత్రమే ఆడుతున్నాడు. కోహ్లీ లేని సమయాన్ని సద్వినియోగం చేసుకుంటే.. భవిష్యత్తులో కెప్టెన్ అవ్వొచ్చు.

నాలుగు టెస్ట్ సిరీస్‌కు తాను అందుబాటులో లేకపోయినా అజింక్యా రహానే ఉన్నాడని, అతను భారత జట్టును అద్భుతంగా నడిపిస్తాడని విరాట్ కోహ్లీ ఆశాభావం వ్యక్తం చేశాడు. 'నేను, రహానే గత కొన్నేళ్లుగా కలిసి ఆడుతున్నాం. మా ఇద్దరి మధ్య మంచి సమన్వయం ఉంది. ఇద్దరం కలిసి బ్యాటింగ్‌లో ఎన్నో మంచి భాగస్వామ్యాలు నెలకొల్పాం. ఆసీస్‌తో రెండు ప్రాక్టీస్ మ్యాచ్‌ల్లో రహానే జట్టును అద్భుతంగా నడిపించాడు. అతని బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించాడు. అతనికి జట్టు బలాలు, బలహీనతలు తెలుసు. పరిస్థితులకు తగ్గట్లు అనుసరించాల్సిన వ్యూహాలపై అవగాహన ఉంది. మేం ఇద్దరం ఒకటే. నా గైర్హాజరీలో రహానే రఫ్ఫాడిస్తాడని నేను ఖచ్చితంగా చెప్పగలను. నేను ఇక్కడ ఉన్నంత వరకు కెప్టెన్‌గా, ఆటగాడిగా నా సామర్థ్యం మేరకు ఉత్తమ ప్రదర్శన కనబరుస్తాను. రహానే కూడా అదే తరహాలో రాణిస్తాడని ఆశిస్తున్నా. అంతేకాకుండా రహానే ఓ వ్యక్తిగా ఎదగాడానికి, తన సత్తా నిరూపించేందుకు ఇదే సరైన సమయం. ఈ విషయాన్ని నేను గతంలో కూడా చెప్పాను' అని విరాట్ అన్నాడు.

Story first published: Wednesday, December 16, 2020, 22:18 [IST]
Other articles published on Dec 16, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+