సిడ్నీ: ఆస్టేలియాలోని డార్లింగ్ హార్బర్‌లో ఉన్న మేడం టుస్సాడ్స్ మ్యూజియంలో రెండేళ్ల క్రితం ప్రదర్శనకు పెట్టిన క్రికెట్ లెజెండ్ సచిన్ టండూల్కర్ మైనపు విగ్రహాన్ని కొన్ని నెలలు క్రితం తీసేశారు. అందుకు కారణం ఆ మైనపు బొమ్మ ధరించిన బ్లూ జెర్సీ.
ఆ మైనపు బొమ్మను రూపొందించిన వారు ఐసీసీ వరల్డ్ టీ20 టోర్నమెంట్లో టీమీండియా ధరించిన బ్లూ జెర్సీని వేశారు. అయితే సచిన్ టెండూల్కర్ అసలు ఆ మ్యాచ్‌లో ఆడలేదన్న విషయాన్ని మిడ్ డే పత్రిక వాళ్లు మ్యూజియం దృష్టికి తీసుకెళ్లడంతో మైనపు బొమ్మకు రంగు మారుస్తామని చెప్పారు.
అందులో భాగంగానే సచిన్ మైనపు బొమ్మను మ్యూజియం నుంచి తీసేశారు. అయితే ఈ విషయం తెలియక సిడ్నీలో భారత్-ఆస్టేలియా సెమీ పైనల్ మ్యాచ్ వీక్షించేందుకు వచ్చిన పత్రికా ప్రతినిధులు శుక్రవారం మేడం టుస్సాడ్స్ మ్యూజియానికి సచిన్ విగ్రహాన్ని చూసేందుకు వెళ్లారు.

కొన్ని నెలలు క్రితమే సచిన్ విగ్రహాన్ని తీసేశామని మ్యూజియం ప్రతినిధులు చెప్పడంతో వారంతా ఒక్కసారి షాక్‌కు గురయ్యారు. రంగు మార్చే క్రమంలో సచిన్ మైనపు బొమ్మను బ్యాంకాక్‌కు పంపామని, ఇలా బొమ్మలను ఒక చోట నుంచి మరో చోటికి పంపడం సర్వ సాధారణమేనని మ్యూజియం సూపర్ వైజర్ ఒకరు తెలిపారు.
ఎంతో అపురూపంగా చూసుకునే సచిన్ బొమ్మను ఏమాత్రం సమాచారం లేకుండానే తరలించడం ఏంటని మ్యూజియం అధికారులపై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. టుస్సాడ్స్ మ్యూజియంలో సచిన్ మైనపు బొమ్మ ఉన్న సమయంలో చాలా మంది అభిమానులు వచ్చి సచిన్ బొమ్మ పక్కనే నిలబడి ఫోటో దిగడం లాంటివి చూశాం.