ముంబై: క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ముంబై నగర పోలీసులపై సోషల్ మీడియా వేదికగా ప్రశంసలు కురిపించారు. ముంబై పోలీసులు చేస్తున్న సేవలను చూపిస్తూ ఫొటోలు, వీడియోను సచిన్ తన ఫేస్‌బుక్ ఖాతాలో పోస్ట్ చేశాడు. ఇప్పుడవి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. అంతేగాక, సచిన్‌ను పొగుడుతూ సందేశాలు కూడా వస్తున్నాయి.
ఎండకు, వానకు బెదరక ముంబై పోలీసులు నగరవాసుల రక్షణ కోసం పాటుపడుతున్న వైనాన్ని సచిన్ తన ఈ వీడియో సందేశం ద్వారా చూపాడు. మన భద్రత కోసం భారీ వర్షంలోనూ పోలీసులు పాటుపడుతున్నారని, వారికి తన సెల్యూట్ అని మాస్టర్ ఎఫ్‌బీలో ఈ వీడియో పోస్ట్ చేశాడు.

కాగా, ఈ వీడియో షేర్ చేసిన కొన్ని గంటల్లోనే పది లక్షల వ్యూస్ రాగా.. 40 వేల మంది దీనిపై రియాక్ట్ అయ్యారు. ట్విట్టర్‌లో ఇదే వీడియోకు 1500 రీట్వీట్స్ రాగా.. 7 వేల లైకులు వచ్చాయి.
ఇది ఇలా ఉండగా, సచిన్ వీడియోపై ముంబై పోలీసులు స్పందించారు. తమపై చూపిన అభిమానానికి కృతజ్ఞతలు చెప్పారు. తాము భవిష్యత్తులోనూ ఇలాగే కృషి చేస్తామని తెలిపారు.
'వీడియో బాగుంది కానీ, నీవు డ్రైవ్ చేస్తూ వీడియో తీయలేదని భావిస్తున్నాం. ఈ విషయంలో ముంబై పోలీసుల సలహాలను పాటించాలి?' అంటూ మరికొందరు వ్యాఖ్యానించడం కొసమెరుపు.