ముంబై : ముంబై పోలీసుల శ్రమను అభినందిస్తూ.. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ట్విట్టర్ లో పోస్ట్ చేసిన వీడియోకు నెటిజెన్స్ నుంచి మంచి స్పందన లభిస్తోంది. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా.. ముంబై ట్రాఫిక్ ను క్లియర్ చేయడం కోసం అక్కడి పోలీసులు శ్రమిస్తోన్న తీరును తన సెల్ ఫోన్ ద్వారా వీడియో తీసిన సచిన్.. అనంతరం దాన్ని ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు.

ప్రజా భద్రత కోసం ఎండా వాన అన్న తేడా లేకుండా.. అంకిత భావంతో పనిచేస్తోన్న ముంబై పోలీసులకు తాను సెల్యూట్ చేస్తున్నట్టు ట్విట్టర్ లో కామెంట్ చేశాడు మాస్టర్. రోడ్డుపై ట్రాఫిక్ ను నియంత్రించడానికి పోలీసులు పడుతోన్న కష్టాన్ని వీడియో ద్వారా కళ్లకు గట్టాడు.
కాగా మాస్టర్ తన ఖాతాలో ఈ వీడియోను పోస్ట్ చేయగానే.. కేవలం 15 గంటల్లో 6లక్షలకు పైగా వ్యూస్ రావడం విశేషం. దీనికి ప్రతిగా స్పందించిన ముంబై పోలీసులు ట్విట్టర్ ద్వారా మాస్టర్ కు ధన్యవాదాలు తెలిపారు.