
హైదరాబాద్: టీమిండియా క్రికెట్ దిగ్గజం, యువ క్రికెటర్లకు రోల్ మోడల్ అయిన సచిన్ టెండూల్కర్ అంటే ఇష్టం ఉండని వారెవరుంటారు. ఇదే క్రమంలో టెండూల్కర్ గురించి అతని కూతురు సారా టెండూల్కర్ చేసిన ట్వీట్‌కు సచిన్ అదే స్థాయిలో స్పందించారు. ఫాదర్స్ డే సందర్భంగా చేసిన ఈ ఇద్దరి ట్వీట్లు పూర్తి అప్యాయతతో కూడి ఉండడంతో ఇప్పుడు వైరల్‌గా మారాయి.
ఫాదర్స్ డే సందర్భంగా సారా తన ట్విట్టర్ ద్వారా 'తండ్రిగా మీరు మాకు కల్పించే రక్షణ.. మాపై చూపించే ఎనలేని ప్రేమ చూపించినందుకు ధన్యవాదాలు. రోల్ మోడల్ అయ్యేంతటి వ్యక్తిత్వం ఉన్న మీకు ధన్యవాదాలు. కోపంలో ఉన్నానని.. నా మూడ్‌ని మార్చేందుకు నవ్వు తెప్పించని జోక్‌లు వేసినందుకు థ్యాంక్యూ. మీరు మాతో ఉంటున్నందుకు ధన్యవాదాలు. హ్యపీ ఫాదర్స్ డే బాబా. ఇలా ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటాను' అని సచిన్ కూతురు సారా ట్వీట్ చేసింది.
దానికి స్పందించిన సచిన్ టెండూల్కర్ ఆయన ట్విట్టర్ ద్వారా ఇలా స్పందించారు. 'సారా.. నువ్వూ అర్జున్ ఎప్పుడూ నాలో కొత్త ఉత్సాహాన్ని నింపుతుంటారు. మిమ్మల్ని పొందడం ఆ దేవుడి ఆశీర్వాదం కింద భావిస్తాను. మీరు నాకెప్పుడు పసివాళ్లే. మీరు నాతో ఉన్నందుకు ధన్యవాదాలు.' అని టెండూల్కర్ పోస్టు చేశాడు.
ఇటీవలే అర్జున్ టెండూల్కర్ కూడా అతని తండ్రిని ప్రేరణగా తీసుకుని అండర్ 19జట్టులోకి అడుగుపెట్టాడు. శ్రీలంకలో జరగనున్న రెండు ఫోర్ డే మ్యాచ్‌లలో ఆడేందుకు ఎంపికయ్యాడు. ఈ సిరీస్ జూలైలో జరగనుంది. సచిన్ టెండూల్కర్ 2013వ సంవత్సరం అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్‌మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే.