హైదరాబాద్: క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ టెండూల్కర్ ముంబై అండర్ 19 జట్టులో ఆడేందుకు రంగం సిద్ధమైంది. అక్టోబరు 9న బరోడాపై జరిగే మ్యాచ్‌లో అర్జున్ టెండూల్కర్ అరంగేట్రం చేయనున్నాడు. తాజాగా ముంబై ఆడే తొలి రెండు మ్యాచ్‌లకు గాను జట్టును రాజేశ్ పవార్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ ప్రకటించింది.
అగ్రిచోప్రా కెప్టెన్‌గా వ్యవహరించే ఈ జట్టులోకి ఆల్ రౌండర్‌గా అర్జున్ టెండూల్కర్ చోటు దక్కించుకున్నాడు. అర్జున్ టెండూల్కర్‌కు జట్టులో చోటు కల్పించడంపై రాజేశ్ పవార్ స్పందించారు. 'అర్జున్ ఇటీవల కాలంలో మెరుగైన ప్రదర్శన చేస్తున్నాడు. ముంబైలో జరిగిన రెండు ప్రాక్టీస్ మ్యాచ్‌ల్లోనూ ఆకట్టుకున్నాడు. అటు బ్యాటింగ్‌లోనూ ఇటు బౌలింగ్‌లోనూ సత్తాచాటాడు' అని చెప్పాడు.

'అతన్ని బౌలింగ్ ఆల్ రౌండర్‌గా పరిగణించే అండర్ 19 జట్టులో ఎంపిక చేశాం. అందుకే ఇప్పుడు అతను ముంబై అండర్-19 జట్టులో నెంబర్ వన్ ఆల్‌రౌండర్. అతడ్ని సెలక్షన్ కమిటీ ఆల్‌రౌండర్‌గా జట్టులోకి ఎంపిక చేసింది' అని రాజేశ్ పవార్ వెల్లడించాడు.
2015-16 సీజన్‌లో ముంబై అండర్ 16 జట్టుకు అర్జున్ ప్రాతినిథ్యం వహించాడు. మరొకవైపు గతేడాది 'బి' డివిజన్ క్రికెట్ టోర్నీల్లో కూడా అర్జున్ పాల్గొన్నాడు. ఈ ఏడాది ఆరంభంలో ఇంగ్లండ్‌కు వెళ్లి బౌలింగ్, బ్యాటింగ్‌లో శిక్షణ తీసుకున్నాడు.