న్యూఢిల్లీ: మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్ 'ప్లేయింగ్ ఇట్ మై వే' పుస్తకం విడుదలకు ముందే సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. భారత మాజీ కోచ్ గ్రెగ్ చాపెల్ పైన సచిన్ తన పుస్తకంలో పేర్కొన్న అంశాలకు మన ఆటగాళ్ల నుండి మద్దతు లభించింది.
అయితే, ఈ సంచలనానికి కేంద్ర బిందువు అయిన రాహుల్ ద్రావిడ్ స్పందించేందుకు నిరాకరించారు. ఈ నేపథ్యంలో సచిన్ ఆటో బయోగ్రఫీ పైన పలు రకాల ఊహాగానాలు, ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
గ్రెగ్ చాపెల్ గురించి రాసిన సచిన్ టెండుల్కర్.. తన వన్డే రిటైర్మెంట్ గురించి తన పుస్తకంలో ప్రస్తావించారా? రిటైర్మెంట్ గురించి చెబితే ఏం చెబుతారు? అలాగే శ్రీనివాసన్ గురించి ఉంటుందా? అనే విషయాల పైన చర్చ సాగుతోంది. సచిన్ వన్డేల నుండి రిటైర్ అయిన సమయంలో కొన్ని రకాల వాదనలు వినిపించిన విషయం తెలిసిందే. దీని పైన అతను ఎలా స్పందిస్తారోనని అందరు ఎదురు చూస్తున్నారు.

గ్రెగ్ చాపెల్ కోచ్‌గా ఉన్న సమయంలో తన వద్దకు వచ్చి రాహుల్ ద్రావిడ్‌ను తీసేద్దామని తనతో అన్నాడని సచిన్ తన పుస్తకంలో పేర్కొన్నారు. దీని పైన సౌరవ్ గంగూలీ, వీవీఎస్ లక్ష్మణ్, హర్భజన్ సింగ్, జహీర్ ఖాన్ తదితరులు స్పందించారు. వీరంతా సచిన్‌కు మద్దతు పలికారు.
అయితే, తన క్రీడా జీవితంలో ఎలాంటి వివాదాలకు తావివ్వని సచిన్ టెండుల్కర్ ఇప్పుడు.. గ్రెగ్ చాపెల్ పైన విమర్శలు గుప్పించడం ద్వారా వివాదాస్పదం కావడం చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలో పలు రకాల ఊహాగానాలు, ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
గ్రెగ్ చాపెల్, రాహుల్ ద్రావిడ్ విషయంలో సచిన్ టెండుల్కర్ ఇన్నాళ్లు ఎందుకు మౌనంగా ఉన్నారు? ఈ అంశం అంత సీరియస్‌ది అయినప్పుడు మౌనంగా ఎలా ఉండగలిగారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా సారథిగా రాహుల్ ద్రావిడ్ కంటే సచిన్ రికార్డ్ ఏమాత్రం మెరుగ్గా లేదు.
ద్రావిడ్, సచిన్‌లో చెరో 25 టెస్ట్ మ్యాచ్‌లకు సారథ్య బాధ్యతలు నిర్వహించారు. అందులో ద్రావిడ్ నేతృత్వంలో 8, సచిన్ నేతృత్వంలో 4 మ్యాచ్‌లు భారత్ గెలిచింది. వన్డేల విషయానికి వస్తే.. ద్రావిడ్ 79 వన్డేలకు సారథ్యం వహిస్తే 42 వాటిల్లో గెలిచాం. సచిన్ 72 వన్డేలకు సారథ్యం వహిస్తే 23 వాటిల్లో భారత్ గెలిచింది.
ఇదిలా ఉండగా.. 2004లో పాకిస్తాన్‌లో జరిగిన మ్యాచ్‌లో.. సచిన్ తన డబుల్ సెంచరీకి ఆరు పరుగుల దూరంలో ఉన్నప్పుడు ద్రావిడ్ డిక్లేర్ చేశారు. దీని పైన కూడా ఇప్పుడు చర్చ సాగుతోంది. సచిన్ టెండుల్కర్ ఆటో బయోగ్రఫీ విడుదలయ్యాక ఎంత సంచలనం సృష్టిస్తోందనని అభిప్రాయపడుతున్నారు.