హైదరాబాద్: ఓ అభిమాని లెటర్‌కు క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ ప్రతిస్పందించాడు. ఇంతకీ ఎవరా ఫ్యాన్. ఏంటీ ఆ లెటర్ అని అనుకుంటున్నారా? కరణ్ గాంధీ అనే వ్యక్తి సచిన్ టెండూల్కర్‌కు వీరాభిమాని. ప్రస్తుతం అమెరికాలో ఉంటున్న అతడికి సచిన్ అంటే ఎంత ఇష్టమో లేఖ రూపంలో వివరించాడు.
ఆ లేఖను సచిన్ తన ఇనిస్టాగ్రామ్‌లో అభిమానుల కోసం పోస్టు చేశాడు. అందులో 'డియర్ సచిన్, నా పేరు కరణ్. నేను ప్రస్తుతం అమెరికాలో ఉంటున్నాను. ఇండియాలోనే పుట్టి పెరిగాను. చెప్పాలంటే మిమ్మల్ని, మీఆటని చూస్తూ పెరిగాను. మీరు వన్డేలు ఆడుతున్న రోజుల్లో మీ ఆటను చూడ్డానికి లెక్కలేనన్ని రోజులు ట్యూషన్ మానేశాను. ఈ విషయాలన్నీ మీకు చెప్పాలని ఎప్పుడూ అనుకుంటుండేవాడిని. సచిన్, మీరు చాలా బిజీ అని తెలుసు. కానీ మీ నుంచి సమాధానంగా లేఖను ఆశిస్తున్నాను. నేను అమితంగా ఆరాధించే వ్యక్తుల నుంచి సంతకం చేసిన లేఖలు సేకరిస్తుంటాను. మీ నుంచి కూడా ఓ లేఖ రావాలని ఆశిస్తున్నాను. థ్యాంక్యూ' అని అందులో రాశాడు.
సచిన్‌కు పంపిన ఈ లేఖను ఫేస్‌బుక్‌లో షేర్ చేస్తూ 'లేఖ పంపినందుకు థ్యాంక్యూ. నాకు తెలిసి మీ చిన్నప్పటి ట్యూషన్ టీచర్ కూడా వన్డే మ్యాచ్‌లు జరుగుతున్నప్పుడు బాధపడేవారేమో' అంటూ సరదాగా సచిన్ వ్యాఖ్యానించడం విశేషం.
43ఏళ్ల సచిన్ టెండూల్కర్ నవంబర్, 2013లో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. ప్రపంచ క్రికెట్‌లో ఎన్నో రికార్డులను సైతం సృష్టించాడు. రిటైర్మెంట్ అనంతరం సచిన్ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ అభిమానులతో టచ్‌లో ఉంటున్నారు.