ముంబై: పరిమిత ఓవర్ల క్రికెట్‌లో డబుల్ సెంచరీ సాధించాలని కాకుండా సుదీర్ఘమైన ఇన్నింగ్స్‌లు ఆడటాన్ని నేర్చుకోవాలని అండర్-16 జట్టుకు క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ సలహా ఇచ్చాడు. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని సచిన్ టెండూల్కర్ ముంబై అండర్-16 క్రికెటర్లతో ముచ్చటించాడు.
'ట్వంటీ20 తరహాలో ప్రతీ బంతిని బలంగా కొట్టాలని భావించకండి. అది మన ప్రతిభకు వెలుగులోకి రానివ్వదు. ప్రత్యేకంగా కాపీ బుక్ క్రికెట్, బేసిక్స్‌ను కచ్చితంగా ఫాలో కావాలి. అలా ఆడినప్పుడే మీలో ఆట బయటకొస్తుంది' అని సచిన్ సలహా ఇచ్చాడు.
అదే జట్టులో ఉన్న సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ టెండూల్కర్ కూడా తండ్రి సలహాలను ఆసక్తిగా ఆలకించాడు. అండర్ 16 జట్టుకు మెంటార్‌గా వ్వవహరిస్తున్నారు. ఈ సందర్భంగా ఒక మెంటార్ లాగా కాకుండా వారితో ఒక స్నేహితుడిలా కలిసిపోయి సలహాలిచ్చాడు.

సుదీర్ఘమైన ఇన్నింగ్స్‌లు ఆడినప్పుడే జట్టుకు విజయాలు లభిస్తాయనే విషయాన్ని గుర్తించాలని సూచించాడు. అయితే ఫ్లాషీ స్ట్రోక్స్(దిల్ స్కూప్, రివర్స్ స్వీప్, స్విచ్ హిట్) ఆట జూనియర్ స్థాయిలో చాలా ప్రమాదకరమని పేర్కొన్నాడు.
2015లో తాను ఆస్వాదించిన అద్భుతమైన క్షణాలను ఓ వీడియో రూపంలో సచిన్ టెండూల్కర్ ఫేస్‌బుక్‌లో పోస్టు చేశాడు. పోస్టు చేసిన కొద్ది సేపటికే ఈ వీడియోలో సోషల్ మీడియాలో ఓ వైరల్‌లా వెళ్లింది. అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన సచిన్ టెండూల్కర్ ప్రస్తుతం కుటుంబంతో గడుపుతున్నారు.