

హైదరాబాద్: ద్రోణాచార్య అవార్డు గ్రహీత, క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ గురువు రమాకాంత్ అచ్రేకర్ (87) కన్నుమూశారు. గత కొన్నాళ్లుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన బుధవారం ముంబైలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. 'ఆయన (అచ్రేకర్ సర్) మనకిక లేరు. ఈ రోజు సాయంత్రం కన్నుమూశారు' అని కుటుంబ సభ్యులు మీడియాకు తెలిపారు.
ముంబైలో దాదార్‌లోని శివాజీరాజ్ పార్కులో రమాకాంత్ ఎందరో యువ క్రికెటర్లకు కోచింగ్ ఇచ్చేవారు. లెజండరీ క్రికెట్ కోచ్‌గా పేరుగాంచిన అచ్రేకర్ వినోద్ కాంబ్లి, ప్రవీన్ ఆమ్రె, సమీర్ దిఘె, బల్విందర్ సింగ్ సంధు, అజిత్ అగార్కర్ వంటి క్రికెటర్లకు క్రికెటర్లను తీర్చిదిద్దారు. ఆయనకు కీర్తి ప్రతిష్టలను తెచ్చిపెట్టింది మాత్రం సచిన్ టెండూల్కరే.
సచిన్ ఆయన ప్రియ శిష్యుడు కూడా. క్రికెట్ రంగంలో అసమాన సేవలందించినందుకు గాను కేంద్రప్రభుత్వం ఆయనకు 1990లో ద్రోణాచార్య అవార్డుతో, 2010లో పద్మశ్రీ అవార్డులతో సత్కరించింది. దీంతో పాటు ముంబైలోని జింఖాన శతాబ్ధి ఉత్సవాల సందర్భంగా అచ్రేకర్ కు 'లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు' ను అందజేశారు.
అంతర్జాతీయ క్రికెట్లో సచిన్ సుధీర్ఘ కాలం పాటు కొనసాగడంలో అచ్రేకర్ పాత్ర ఎనలేనిది. ప్రతి గురుపౌర్ణమికి ఆయన ఇంటికి వెళ్లి ఆశీర్వాదం తీసుకుంటాడు. శాలువా కప్పి సత్కరించేవారు. బాల్యంలో ఆయనెంత కఠినంగా శిక్షణనిచ్చారో గుర్తు చేసుకొనేవారు. 1932లో అచ్రేకర్ జన్మించారు. క్రికెట్ కెరీర్ అంత సవ్యంగా సాగలేదు.
1943లో క్రికెట్ ఆడటం ప్రారంభించారు. 1945లో న్యూ హిందు స్పోర్ట్స్ క్లబ్ తరఫున ఆడారు. యంగ్ మహారాష్ట్ర ఎలెవన్, గుల్ మోహర్ మిల్స్, ముంబయి పోర్ట్‌కు ప్రాతినిథ్యం వహించారు. 1963-64 మొయిన్‌ద్దౌలా టోర్నీలో ఆల్ ఇండియా స్టేట్ బ్యాంకు జట్టు తరఫున హైదరాబాద్‌పై ఒక ఫస్ట్‌క్లాస్ మ్యాచ్ ఆడారు.
ఆ తర్వాత ముంబైలోని శివాజీ పార్క్ వద్ద కామత్ స్మారక క్రికెట్ క్లబ్‌ను రమాకాంత్ అచ్రేకర్ ప్రారంభించారు. ఎంతో మంది క్రికెటర్లకు ఆయన పాఠాలు చెప్పారు. ప్రస్తుతం ఈ క్లబ్‌ను అచ్రేకర్ కుమార్తె కల్పన, అల్లుడు దీపక్ చూసుకుంటున్నారు. రమాకాంత్ అచ్రేకర్ మృతి పట్ల బీసీసీఐ ట్విట్టర్ వేదికగా సంతాపం వ్యక్తం చేసింది.