బెంగళూరు: క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ తన క్రికెట్ జీవితాన్ని ఎలా పొగిగించుకున్నాడనే విషయంపై మాజీ పేస్ దిగ్గజం జవగళ్ శ్రీనాథ్ ఆసక్తికర విషయాలను వెల్లడించారు. మైదానంలో సుదీర్ఘకాలం పాటు తన బ్యాటింగ్ విన్యాసాలతో అభిమానుల్ని మెప్పించిన సచిన్ టెండూల్కర్ టెక్నాలజీ సాయంతోనే తన కెరీర్‌ను పొడిగించుకున్నట్లు శ్రీనాథ్ వెల్లడించాడు.
క్రికెట్‌లో సాంకేతిక పరిజ్ఞానం వినియోగంపై ఇటీవల మైక్రోసాఫ్ట్ సంస్థ బెంగళూరులో నిర్వహించిన ఓ కార్యక్రమంలో శ్రీనాథ్ పాల్గొన్నారు. 'సాంకేతికత సాయంతోనే తన కెరీర్‌ను పొడిగించుకన్నట్లు సచిన్ అప్పట్లో నాతో చెప్పాడు. బ్యాటింగ్‌కు సంబంధించిన మెలకువలు తెలుసుకోవడంతో పాటు వేగంగా తప్పిదాలను దిద్దుకోవడానికి కూడా టెక్నాలజి తనకెంతో ఉపకరిస్తోందని సచిన్ ఆ సమయంలో సంతోషం వ్యక్తం చేశాడు' అని శ్రీనాథ్ ఈ సందర్భంగా వెల్లడించాడు.

క్రికెటర్లు సాంకేతికతను ఎక్కువగా వినియోగిస్తుండటంతో కోచ్ ప్రాధాన్యత తగ్గుతోందా? అని ప్రశ్నించగా.. 'కోచ్ ప్రాధాన్యత ఎప్పటికీ తగ్గదు. అయితే సాంకేతితపై కోచ్‌గా ఉన్న వ్యక్తికి ఉన్న పరిజ్ఞానం ఆధారంగా ఓ నిర్ణయం తీసుకోవచ్చు' అని శ్రీనాథ్ తెలిపాడు.
నవంబరు 15, 1989లో అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేసిన సచిన్ టెండూల్కర్ దాదాపు 24 ఏళ్ల పాటు భారత్‌కు ప్రాతినిథ్యం వహించిన విషయం తెలిసిందే. 1991లో అరంగేట్రం చేసిన శ్రీనాథ్ అతి తక్కువ సమయంలోనే జట్టులో కీలక బౌలర్‌గా ఎదిగినా.. 2003లోనే ఆటకు వీడ్కోలు పలికాడు.