ముంబై: తాను ఇటీవల లండన్‌లో 'లాస్ట్ బస్సు మిస్సయ్యా. ఎవరైనా లిఫ్ట్ ఇస్తారా?' అని చేసిన ట్వీటుపై బ్యాటింగ్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ స్పందించారు. ఆ ట్వీటును సీరియస్‌గా తీస్కోవద్దని, అందులోని హాస్యాన్ని గుర్తించాలని చెప్పారు.
జులై 10న వింబుల్డన్ టెన్నిస్ ఛాంపియన్‌షిప్‌ను ప్రత్యక్షంగా వీక్షించేందుకు వెళ్లిన సచిన్ టెండూల్కర్.. లండన్‌లోనే ఓ బస్టాప్‌లో కూర్చుని ఫొటో దిగారు. ఈ ఫొటోను ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. 'గ్రేట్ షోసేలే ఆక్స్‌ఫోర్డ్‌షైర్‌లో నేను చివరి బస్సు మిస్సయ్యా. నాకు ఎవరైనా లిఫ్ట్ ఇస్తారా?' అని తన ట్విట్టర్ ఖాతాలో ట్వీట్ చేశారు.

కాగా, క్రికెట్ దేవుడి ట్వీట్‌కు భారతదేశంలోని అభిమానుల నుంచి భారీ స్పందన వచ్చింది. అయితే లండన్‌లో ఉన్న సచిన్ టెండూల్కర్‌కు ఎలా లిఫ్ట్ ఇచ్చేదనే ఆలోచనలో పడ్డారు. ఒక వేళ తాము అక్కడుంటే తప్పకుండా లిఫ్ట్ ఇచ్చేవారమంటూ రిట్వీట్లతో ముంచెత్తారు.
దీంతో సచిన్ 13వ తేదీన మరో ట్వీట్ చేశారు. ఇంతకుముందు పెట్టిన ఫొటోనే సోమవారం ట్విట్టర్‌లో పెట్టిన సచిన్.. 'బస్సు కాదు కానీ, జోక్‌ను కొందరు మిస్సయ్యారు' అని రాశారు. చిలిపిగా తీసుకున్న ఈ ఫొటోతో సచిన్.. అతడ్ని ఫాలో అవుతున్న 7.15 మిలియన్ల ఫాలోవర్స్‌ను బౌల్డ్ చేశారు.