ముంబై: సచిన్ టెండుల్కర్ ఆత్మకథ నవంబరు ఆరున మార్కెట్లోకి రానుంది. బ్యాటింగ్‌లో సచిన్ ఎన్నో రికార్డులను సొంతం చేసుకున్నాడు. అలాంటి సచిన్ ఆత్మకథ పైన అందరికీ ఉత్కంఠ ఉంది. ప్లే ఇట్ మై వే అన్న పేరుతో ఈ పుస్తకానికి ప్రముఖ క్రికెట్ చరిత్రకారుడు బొరి మజుందార్ సహ రచయితగా వ్యవహరించాడు.
జీవిత చరిత్రను పుస్తకం రూపంలోకి తేవాలంటే ఎన్నో అంశాలను నిజాయితీగా అంగీకరించాల్సి ఉంటుందని సచిన్ టెండుల్కర్ మంగళవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో వ్యాఖ్యానించాడు. ఇప్పటి వరకూ ఎవరి ముందూ బయటపెట్టని ఎన్నో విషయాలను ప్రస్తావించాల్సి వస్తుందని తనకు ముందే తెలుసన్నాడు.

చివరి టెస్టులో చివరి ఇన్నింగ్స్ ఆడి పెవిలియన్‌కు వెళుతున్నప్పుడు తాను తన కెరీర్‌లో జరిగిన ఎన్నో సంఘటనలను గుర్తు చేసుకున్నానని తెలిపాడు.
తన ఆత్మకథ రాయాలంటే తాను క్రికెట్ ఆడిన రీతిలోనే పూర్తిగా నిజాయితీ ఉండాలని తెలుసన్నాడు. ప్రజలతో పంచుకోని విషయాలు పుస్తకంలో పొందుపర్చాల్సి ఉంటుందన్నాడు. కాగా, ఈ పుస్తకం పైన వాంఖేడేలో చివరిసారి వెస్టిండీస్ పైన టెస్టు ఇన్నింగ్సులో 74 పరుగులు చేసిన తర్వాత మైదానం నుండి వెళ్తూ బ్యాట్ ఎత్తి అభివాదం చేసే చిత్రాన్ని ముద్రించారు.