
ముంబై: క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ తాజాగా టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ పరిచయాన్ని గుర్తు చేసుకున్నారు. స్టార్ బ్యాట్స్‌మెన్‌గా ప్రారంచ వ్యాప్తంగా గుర్తింపు సంపాదించుకున్న మాస్టర్ బ్లాస్టర్ సచిన్.. మరెవరికి సాధ్యం కానన్ని ఎన్నో రికార్డులను నెలకొల్పారు. సచిన్ లాంటి బ్యాట్స్‌మెన్ మరొకరు ఉండరు అనుకుంటున్న తరుణంలో కోహ్లీ టీమిండియా జట్టులోకి వచ్చాడు. సచిన్ స్థాయిలో ఆడుతూ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు సంపాదించుకున్నాడు. అయితే కోహ్లీ తన కెరీర్ మొదటి రోజుల్లో సచిన్ కాళ్లు మొక్కాడట. ఈ విషయాన్ని మాస్టర్ బ్లాస్టర్స్ స్వయంగా తెలిపారు.
అండర్-19 ప్రపంచకప్‌లో అద్భుతంగా రాణించిన విరాట్ కోహ్లీ 2008లో టీమిండియాకి సెలెక్ట్ అయ్యాడు. భారత జట్టులోకి సెలెక్ట్ అయిన తర్వాత కోహ్లీ టీమిండియా డ్రెస్సింగ్ రూముకి వెళ్లి.. మొదటగా చేసిన పని క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కాళ్లు మొక్కడమే. కోహ్లీ పనితో ఒక్కసారిగా ఆశ్చర్యపోయిన సచిన్.. ఏం జరిగిందని ఆరా తీశారట. కోహ్లీతో సీనియర్ క్రికెటర్లు యువరాజ్ సింగ్, మునాఫ్ పటేల్, ఇర్ఫాన్ పఠాన్ ప్రాంక్ చేశారని సచిన్ తెలుసుకుని ఓ చిరునవ్వు నవ్వారట.
తాజాగా సచిన్ టెండూల్కర్ ఓ వీడియో ద్వారా విరాట్ కోహ్లీకి సంబందించిన ఫన్నీ ఎపిసోడ్‌ను గుర్తుచేసుకున్నారు. 'టీమిండియాకు ఎంపికై డ్రెస్సింగ్ రూమ్‌లోకి వచ్చిన తర్వాత కోహ్లీ నేరుగా వచ్చి నా కాళ్లు మొక్కాడు. 'నేను షాకై.. ఏం చేస్తున్నావ్. ఇలాంటివి చేయనవసరం లేదు. నాకు నచ్చవు కూడా' అని చెప్పా. కోహ్లీని పైకి లేపి అటు ఇటూ చూడగా.. యువరాజ్ సింగ్, మునాఫ్ పటేల్, ఇర్ఫాన్ పఠాన్ నవ్వుతూ కనిపించారు. భారత్ జట్టులోకి కొత్తగా సెలెక్ట్ అయినవారు మొదటగా సచిన్ నుంచి ఆశీర్వాదం తీసుకోవాలని కోహ్లీకి వారు చెప్పారట' అని సచిన్ తెలిపారు.
టీమిండియాకి 24 ఏళ్ల పాటు ఆడిన సచిన్ టెండూల్కర్ 100 సెంచరీలు నమోదు చేశారు. విరాట్ కోహ్లీ ప్రస్తుతం 70 సెంచరీలతో కొనసాగుతున్నాడు. 2008లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి వచ్చిన కోహ్లీ ఇప్పటి వరకూ 91 టెస్టులాడి 52.4 సగటుతో 7490 పరుగులు చేశాడు. ఇందులో 27 సెంచరీలు (7 డబుల్ సెంచరీలు), 25 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 254 వన్డేల్లో 59.1 సగటుతో 12169 రన్స్ బాదాడు. ఇందులో 43 సెంచరీలు, 62 అర్ధ శతకాలు ఉన్నాయి. ఇక 90 టీ20లలో 52.6 సగటుతో 3159 రన్స్ చేశాడు. మొత్తంగా అంతర్జాతీయ క్రికెట్‌లో 70 సెంచరీలు చేసిన కోహ్లీ.. 22 వేలకు పైగా పరుగులు చేశాడు.