ముంబై: బ్యాటింగ్ లెజెండ్ సచిన్ టెండుల్కర్ బుధవారం నాడు.. తన చిన్ననాటి సంఘటను ఒకదానిని గుర్తు చేసుకున్నాడు. ఓసారి రైలు ట్రాక్ దాటుతున్న సమయంలో తాను చావు దగ్గరి వరకు వెళ్లి వచ్చానని ఓ కార్యక్రమంలో గుర్తు చేసుకున్నాడు.
బుధవారం సచిన్ టెండుల్కర్ ముంబై రైల్వే పోలీసులు తీసుకు వస్తున్న సమీప్ (సేఫ్టీ మెసేజ్ ఎగ్జిక్లూసివ్‌లీ ఫర్ పాసెంజర్స్), బీ-సేఫ్ అనే రెండింటిని ప్రారంభోత్సవం సమయంలో మాట్లాడాడు. తాను చిన్న వయస్సులో ఉండగా ఎదురైన భయానక అనుభవాన్ని గురించి వివరించాడు.
చావును అతి దగ్గరగా చూశానని చెప్పాడు. తాను పదకొండేళ్ల వయసు నుంచే ముంబై లోకల్ రైళ్లలో ప్రయాణించానని, రైళ్ల నుంచి గెంటివేయబడ్డానని, పాఠశాలలో ఉన్నప్పుడు విలే పార్లీ నుంచి స్నేహితులుండే ప్రాంతానికి వెళ్లి అక్కడి నుంచి ప్రాక్టీసుకు వెళ్లే వాడినని చెప్పుకొచ్చాడు.

ఐదారుగురు మిత్రులం కలిసి సినిమాకు వెళ్లాలనుకున్నామని, సినిమా తర్వాత ప్రాక్టీస్‌కు ఆలస్యమవుతుందని భావించి, బాంద్రా రైల్వే స్టేషన్లో ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ కాకుండా ప్లాట్ ఫారాలను దాటాలని ముందుకు కదిలామని, అప్పటికి మధ్యలోకి వెళ్లామని చెప్పాడు.
అన్ని ట్రాక్‌ల పైకి రైళ్లు వేగంగా దూసుకు వస్తున్నాయని తమకు అర్థమై భయపడ్డామని, రెండు పట్టాల మధ్య మోకాళ్లపై కూర్చున్నామని, క్రికెట్ కిట్ బ్యాగులను గట్టిగా పట్టుకున్నామని, జరగబోయే ప్రమాదం ఎలా ఉంటుందా? అని భయపడ్డామని, అదృష్టవశాత్తూ ఏమీ జరగలేదన్నాడు. ఆ తర్వాత ఎప్పుడూ పట్టాలను అలా దాటలేదని చెప్పాడు. తాను అప్పుడు చావును దగ్గరగా చూశానని చెప్పాడు.
ప్రతి యేటా ముంబైలో రైళ్ల నుంచి జారిపడి 700 మంది, పట్టాలు దాటుతూ 1600 మంది మరణిస్తున్నారని, ఇది దురదృష్టకరమని, ఇంట్లో మీ కుటుంబ సభ్యులు ఎదురుచూస్తున్నారన్న ఒక్క విషయాన్ని గుర్తుంచుకుని మరో అయిదు నిమిషాలు కేటాయిస్తే ఈ ఘటనలను నివారించవచ్చునని, కిక్కిరిసిన రైళ్లలో, బోగీలపై ప్రయాణాలను మానుకోవాలని సూచించారు.