హైదరాబాద్: క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రపంచ క్రికెట్లో ఎన్నో రికార్డులు బద్దలు కొట్టడంతో పాటు అనేక రికార్డును సృష్టించాడు. క్రికెట్‌లో వంద వంద సెంచరీలను సాధించిన ఏకైక ఆటగాడు సచిన్ టెండూల్కర్.
అలాంటి సచిన్ టెండూల్కర్‌కి ఫొటోగ్రఫీ గురించి ఏమాత్రం తెలియదని భారత మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ అంటున్నారు. తాజాగా ఆయన ట్విటర్‌లో 1990ల్లో ప్రశాంత్ వైద్యతో కలిసి బీచ్‌లో దిగిన ఫొటోను షేర్ చేశారు. ఈ ఫొటోని సచిన్ టెండూల్కర్ తీశాడు.
ఈ ఫోటోని ట్విట్టర్‌లో పోస్టు చేసి సంజయ్ మంజ్రేకర్ కామెంట్ పెట్టాడు. 'మా బైసెప్స్ చూపించడానికి ప్రయత్నిస్తున్నాం. కానీ ఫొటో సరిగ్గా మధ్యలోకి రాలేదు కదూ? సచిన్ బ్యాటింగ్‌లో బెటరేకానీ ఫొటోగ్రఫీలో కాదు' అని ట్వీట్ చేశారు.
ఈ ట్వీట్ చూసిన నెటిజన్లు సంజయ్ మంజ్రేకర్‌పై తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. నిజమే 90ల్లో సచిన్ ఫోకస్ అంతా క్రికెట్‌పైనే ఉండేదని అంటున్నారు. అందుకు ఆయన చేసిన రికార్డులే నిదర్శనమని అభిమానులు సచిన్‌కు మద్దతుగా నిలిచారు. అంతేకాదు సచిన్ తన స్వహస్తాలతో తీసిన ఫోటో ఎంతో ప్రైస్‌లెస్ అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు.