T20 World Cup 2026: ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా విజయం సాధించినప్పటికీ.. అమెరికా బౌలర్లు భారత బ్యాటర్లకు చుక్కలు చూపించారు. ఓ దశలో భారత వరుస వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. అయితే సూర్యకుమార్ యాదవ్ తన అనుభవంతో జట్టును ఆదుకున్నాడు. ఈ క్రమంలో అమెరికాతో జరిగిన ఉత్కంఠభరిత పోరులో టీమిండియా విజయం సాధించిన తీరుపై క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ ప్రశంసల వర్షం కురిపించారు. ముఖ్యంగా అమెరికా జట్టు కనబరిచిన పోరాట పటిమను క్లిష్ట సమయంలో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఆడిన ఇన్నింగ్స్‌ను సచిన్ ప్రత్యేకంగా కొనియాడారు. ఈ మ్యాచ్‌పై సచిన్ టెండూల్కర్ 'ఎక్స్' (ట్విట్టర్) వేదికగా తన స్పందనను తెలియజేశారు.
సచిన్ టెండూల్కర్ పోస్ట్ సారాంశం
"మ్యాచ్ ఆరంభం కొంచెం టెన్షన్‌గా అనిపించినా.. ముగింపు మాత్రం టీమిండియాకు అద్భుతంగా దక్కింది. కొత్త జట్లు ఇలాంటి వేదికలపై ఇంతటి తెగువను ప్రదర్శించినప్పుడు క్రికెట్ ప్రపంచవ్యాప్తంగా వేగంగా అభివృద్ధి చెందుతుంది. నిన్న అమెరికా జట్టు సరిగ్గా అదే చేసింది. వారి శక్తి, ఉత్సాహం నిజంగా స్ఫూర్తిదాయకం." అంటూ సచిన్ టెండూల్కర్ పేర్కొన్నారు.

సూర్య 'శాంతమే' భారత్‌ను గెలిపించింది!
భారత్‌కు అమెరికా గట్టి పోటీ ఇచ్చిందని సచిన్ అభిప్రాయపడ్డారు. "అమెరికా జట్టు భారత్‌ను ఇబ్బందుల్లోకి నెట్టేందుకు చాలా దగ్గరగా వచ్చింది. కానీ, సూర్యకుమార్ యాదవ్ తన అనుభవాన్ని రంగరించి, ఒత్తిడిలో కూడా ఎంతో ప్రశాంతంగా ఆడాడు. ఆ సామర్థ్యమే భారత్‌ను గౌరవప్రదమైన స్కోరు వైపు నడిపించింది. ఆ తర్వాత మన బౌలర్లు మిగిలిన పనిని పూర్తి చేశారు. వెల్ డన్ టీమిండియా! టోర్నీని విజయంతో ప్రారంభించడం ఎప్పుడూ శుభపరిణామమే" అని సచిన్ రాసుకొచ్చారు.
మ్యాచ్‌లో అసలేం జరిగిందంటే?
అమెరికా బౌలర్ల ధాటికి భారత అగ్రశ్రేణి బ్యాటర్లు విఫలమయ్యారు. భారత యువ సెన్సేషన్ అభిషేక్ శర్మ సున్నాకే ఔట్ అయ్యాడు. మిడిలార్డర్ కూడా కుదేలైంది. తిలక్ వర్మ, ఇషాన్ కిషన్, శివం దూబే ఆరో ఓవర్ కల్లా పెవిలియన్ చేరాడు. హార్దిక్ పాండ్యా, రింకూ సింగ్ కనీసం రెండంకెల స్కోరు కూడా చేయలేకపోయారు. అక్షర్ పటేల్ సహకారంతో ఇన్నింగ్స్ చక్కదిద్దిన సూర్యకుమార్ యాదవ్.. కేవలం 49 బంతుల్లో 10 ఫోర్లు, 4 సిక్సర్లతో 84 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. దీంతో భారత్ 161 పరుగుల స్కోరు సాధించి, చివరకు 29 పరుగుల తేడాతో విజయం సాధించింది.