ముంబై: ప్రపంచ కప్‌లో భాగంగా క్వార్టర్ ఫైనల్లో బంగ్లాదేశ్ పైన గెలిచిన భారత జట్టు పైన మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్ ప్రశంసలు కురిపించాడు. భారత క్రికెట్ జట్టు సెమీ ఫైనల్లోకి ప్రవేశించడం పైన ఆనందం వ్యక్తం చేశాడు. భారత జట్టు అద్భుతంగా ఆడుతోందని ఆయన ట్వీట్ చేశాడు. మరో రెండు మ్యాచులు ఇలాగే కొనసాగించాలని సూచించాడు. రోహిత్ శర్మకు కితాబిచ్చాడు.
కాగా, ఐసిసి వన్డే ప్రపంచ కప్ పోటీల్లో భాగంగా గురువారం జరిగిన క్వార్టర్ ఫైనల్‌లో భారత్ తన ముందు ఉంచిన 303 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడంలో బంగ్లాదేశ్ విఫలమైన విషయం తెలిసిందే. బంగ్లాదేశ్ 45 ఓవర్లలో 193 పరుగులు మాత్రమే చేసి భారత్ చేతిలో చిత్తయింది.

ఉమేష్ యాదవ్ బంతితో, రోహిత్ శర్మ బ్యాట్‌తో రాణించడంతో భారత్ బంగ్లాదేశ్‌పై విజయం సాధించింది. ఉమేష్ యాదవ్ నాలుగు వికెట్లు తీసుకున్నాడు. మొహమ్మద్ షమీ, రవీంద్ర జడేజా రెండేసి వికెట్లు తీసుకున్నారు. మోహత్ శర్మకు ఒక్క వికెట్ లభించింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ రోహిత్ శర్మ సెంచరీ, సురేష్ రైనా అర్థ సెంచరీలతో ఆరు వికెట్ల నష్టానికి 302 పరుగులు చేసింది.
బంగ్లాదేశ్ బౌలర్లలో తస్కిన్ అహ్మద్ మూడు వికెట్లు తీసుకోగా, మొర్తాజా, షకీబ్ అల్ హసన్, రుబెల్ హోసేన్ తలో వికెట్ తీసుకున్నారు. విరాట్ కోహ్లీ వెంటనే పెవిలియన్ చేరుకున్నప్పటికీ రోహిత్ శర్మ, సురేష్ రైనా భారత్ ఇన్నింగ్సును పరుగులు పెట్టించారు. ప్రపంచ కప్‌లో భారత్ జైత్రయాత్ర కొనసాగుతోంది.