హైదరాబాద్: సచిన్-కాంబ్లిలు చిన్ననాటి స్నేహితులు. పాఠశాల స్థాయిలో కలిసి క్రికెట్ కెరీర్ ఆరంభించి, ఆ తర్వాత భారత జట్టుకు కూడా ఆడారు. అయితే వీరిద్దరూ మధ్య కొన్నేళ్ల కిందట విభేదాలు తలెత్తడం... తనకు సచిన్ సరైన మార్గనిర్దేశం చేయలేదంటూ కాంబ్లి ఆరోపణలు చేయడంతో ఇద్దరి మధ్య దూరం పెరిగింది.
అయితే ఇప్పుడు ఇద్దరి మధ్య విభేదాలు సమసిపోయినట్లే కనిపిస్తున్నాయి. తామిద్దరం కలిసిపోయామంటూ 'గత నెల చిన్ననాటి మిత్రుడు సచిన్‌తో తొలి సెల్ఫీ అంటూ' కాంబ్లీ సోషల్ మీడియాలో ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా సచిన్ కూడా కాంబ్లితో కలిసి ఉన్న ఫొటోను ఇనిస్టాగ్రామ్‌లో పోస్టు చేసిన 'ఫ్రెండ్స్ ఫర్ లైఫ్' అంటూ కామెంట్ పెట్టాడు.
గత నెలలో ప్రముఖ జర్నలిస్టు రాజ్ దీప్ సర్దేశాయ్ రాసిన పుస్తకావిష్కరణ కార్యక్రమంలో సచిన్, కాంబ్లి, అటుల్ కస్బేకర్, అమోల్ మజుందార్, అజిత్ అగార్కర్‌లు హాజరయ్యారు. వారితో కలిసి దిగిన ఫొటోను పంచుకున్న సచిన్.. క్రికెట్ తనకు ఈ జీవిత కాల స్నేహితుల్ని అందించిందని.. వారి సహచర్యంలో ముభావంగా ఉండే ఒక్క సందర్భం కూడా లేదని అన్నాడు.
ఈ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది. 1988లో సచిన్-కాంబ్లి స్కూల్ క్రికెట్‌లో 664 పరుగులతో ప్రపంచ రికార్డుని నెలకొల్పారు. తన కెరీర్ పతనం అవుతున్నప్పుడు ప్రొఫెషన్ పరంగా గానీ, వ్యక్తిగతంగా కానీ సచిన్ తనకు అండగా ఉండలేదని.. ఎలాంటి మద్ధతు తెలపలేదని ఓ టీవీ షోలో తన అవేదన వ్యక్తం చేశాడు.
అయితే కాంబ్లి వ్యాఖ్యలపై సచిన్ స్పందించలేదు. అంతేకాదు కాంబ్లి అనారోగ్యంతో ఆసుపత్రిలో ఉన్న సందర్భంలో కూడా కలవలేదు. ఆపై తన ఆటో బయోగ్రఫీ విడుదలకు గానీ, సచిన్ వీడ్కోలు కార్యక్రమానికి సైతం కాంబ్లికి ఆహ్వానం అందకపోవడం గమనార్హం.
దీంతో వీరిద్దరి మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయని అందరూ భావించారు. దీనిపై పలుమార్లు కాంబ్లి ఎంతో ఆవేదన వ్యక్తం చేశాడు. ముఖ్యంగా 2013లో ముంబైలోని వాంఖడేలో వీడ్కోలు మ్యాచ్‌లో సచిన్ తన ఫేర్‌వెల్ మ్యాచ్‌లో కాంబ్లి పేరు ప్రస్తావించకపోవడంపై చాలా బాధ పడ్డాడు.