Ratan Tata: మరణంతోనూ దేశాన్ని కదిలించారు- సచిన్
దిగ్గజ పారిశ్రామికవేత్త రతన్ టాటా (86) కన్నుమూశారు. ముంబైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో వైద్య చికిత్స తీసుకుంటున్న ఆయన బుధవారం అర్ధరాత్రి తుది శ్వాస విడిచారు. రతన్ టాటా మరణ వార్తతో క్రీడాలోకం కూడా శోకసంద్రంలో మునిగిపోయింది. ఆయనకు నివాళులర్పిస్తూ దిగ్గజ ఆటగాళ్లు, ప్రముఖ క్రీడాకారులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
రతన్ టాటా తన జీవితంతో పాటు మరణంతోనూ దేశాన్ని కదలించారని సచిన్ టెండూల్కర్ పేర్కొన్నాడు. దిగ్గజ పారిశ్రామికవేత్త మరణ వార్త తనని తీవ్రంగా కలచివేసిందని, తనతో పాటు లక్షలాదిమంది ప్రజలను తీవ్ర దుఃఖంలోకి నెట్టిందని సచిన్ అన్నాడు. నిర్మించిన సంస్థలు, విలువలు ద్వారా రతన్ టాటా వారసత్వం కొనసాగుతుందని తెలిపాడు. సోషల్ మీడియాలో సచిన్ ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు.

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, వీవీఎస్ లక్ష్మణ్, వీరేంద్ర సెహ్వాగ్, ఇర్ఫాన్ వంటి మాజీ క్రికెటర్లు రతన్ టాటా మరణ వార్తపై సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. ఇతరుల జీవితాలు బాగుకోసం తన జీవితాన్ని గడిపిన గొప్ప వ్యక్తిలా రతన్ టాటా చరిత్రలో నిలిచిపోతారని రోహిత్ శర్మ అన్నాడు. రతన్ టాటాది బంగారు మనసు అని పేర్కొన్నాడు.
దేశం గర్వించదగ్గ దిగ్గజం రతన్ టాటా మనల్ని వదిలి వెళ్లిపోయారని వీవీఎస్ లక్ష్మణ్ పోస్ట్ చేశాడు. ఒక తరం ముగిసినట్లు అనిపిస్తోందని, దేశం కోసం రతన్ టాటా ఎన్నో అద్భుతాలు సృష్టించాడని లక్ష్మణ్ తెలిపాడు. ప్రతి ఒక్కరికి మార్గదర్శకులుగా ఆయన నిలిచిపోయారని ట్వీట్ చేశాడు. అసలైన భారత రతనాన్ని కోల్పోయామని, రతన్ టాటా జీవితం మనందరికీ స్ఫూర్తి అని, మన హృదయాల్లో శాశ్వతంగా నిలిచిపోతారని వీరేంద్ర సెహ్వాగ్ పేర్కొన్నాడు.
రతన్ టాటాతో సంభాషించిన అపూర్వ క్షణాలను తాను ఎప్పటికీ మరిచిపోలేనని, దేశం మొత్తానికి ఆయన స్ఫూర్తి నింపారని, ఆయన్ని ఇష్టపడే ప్రతిఒక్కరికీ శక్తినివ్వాలని కోరుకుంటున్నాని జావెలిన్ త్రో స్టార్ ప్లేయర్ నీరజ్ చోప్రా చెప్పాడు. కేవలం వ్యాపారవేత్తగానే కాకుండా కోట్లాదిమందికి స్ఫూర్తిగా నిలిచిన మహా వ్యక్తిని కోల్పోయామని మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ పేర్కొన్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications