Sachin Tendulkar Praises: బుమ్రా విషయంలో నసీర్ హుస్సేన్ చెప్పిన అభిప్రాయం.. నా మనసులో ఎప్పటి నుంచో ఉంది

లండన్‌లోని ఓవల్‌లో ఇంగ్లాండ్‌తో జరిగిన తొలి వన్డేలో బుమ్రా మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ ప్రదర్శనకు క్రికెట్ ప్రముఖులు ముగ్దులయ్యారు. చాలా మంది క్రికెట్ ఉద్దండులు అతన్ని ప్రశంసిస్తూ సోషల్ మీడియాలో తమ కామెంట్లు చేస్తున్నారు. కాగా ఈ మ్యాచ్ తర్వాత క్రికెట్ దిగ్గజం మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్.. జస్ప్రీత్ బుమ్రాపై ప్రశంసల వర్షం కురిపించాడు. ఇక ఇంగ్లాండ్‌తో మూడు వన్డేల సిరీస్‌లోని మొదటి గేమ్‌లో భారత్ 10వికెట్ల తేడాతో ఇంగ్లాండ్ జట్టును చిత్తు చేసిన సంగతి తెలిసిందే.
ఈ మ్యాచ్ ఇంత భారీ స్థాయిలో గెలవడానికి ప్రధాన కారణం బుమ్రా. ఈ భారత పేస్ గుర్రం ఇంగ్లాండ్ స్వింగ్ పిచ్ పరిస్థితులను పూర్తిగా వాడుకున్నాడు. తన కెరీర్లోనే అత్యుత్తమ బెస్ట్ బౌలింగ్ ఫిగర్స్ నమోదు చేశాడు. తన బౌలింగ్లో కేవలం 19పరుగులు మాత్రమే ఇచ్చి ఆరు వికెట్లతో ఇంగ్లాండ్ బ్యాటింగ్ లైనప్‌ను తుత్తునియలు చేశాడు. దీంతో ఇంగ్లాండ్ కేవలం 110పరుగులకే ఆలౌటైంది. ఈ మ్యాచ్‌లో జాసన్ రాయ్, జో రూట్, లియామ్ లివింగ్‌స్టోన్‌లను బుమ్రా డకౌట్ చేశాడు.
ఇరు జట్ల మధ్య వ్యత్యాసం చూపించే ప్లేయర్ బుమ్రా
ఇక బుమ్రా అత్యద్భుత ప్రదర్శనను ప్రశంసిస్తూ.. టెండూల్కర్ ట్విట్టర్ వేదికగా ప్రశంసపూర్వక పోస్టు చేశాడు. 'ఓవల్ పిచ్ అదనపు బౌన్స్‌ని కలిగి ఉంది. భారత బౌలర్లు సరైన లెంగ్త్‌లతో బౌలింగ్ చేయడం వర్కౌట్ అయింది. భారత పేస్ అటాక్ గొప్ప బౌలింగ్ ప్రదర్శన. ముఖ్యంగా బుమ్రా అసాధారణంగా బౌలింగ్ చేశాడు. అతను ఇరు జట్ల మధ్య ప్రధాన వ్యత్యాసాన్ని చూపించే ప్లేయర్' అంటూ టెండూల్కర్ కితాబిచ్చాడు.

నసీర్ హుస్సేన్ తన ఆర్టికల్లో బుమ్రా గురించి ప్రస్తావిస్తూ..
ఇకపోతే ఈ మ్యాచ్ సందర్భంగా.. ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్, ప్రస్తుత కామెంటేటర్ అయిన నసీర్ హుస్సేన్ కామెంట్రీ చేస్తూ.. జస్ప్రీత్ బుమ్రా ప్రపంచంలోనే ప్రస్తుతం అత్యుత్తమ ఆల్-ఫార్మాట్ బౌలర్ అని పేర్కొన్నాడు. అతను ఈ మ్యాచ్ తర్వాత స్కై స్పోర్ట్స్ కోసం తన కాలమ్‌లో ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ ఆర్టికల్ కూడా రాశాడు.
అతను తన కాలమ్‌లో 'బుమ్రా ప్రపంచ క్రికెట్‌లో అత్యుత్తమ ఆల్ ఫార్మాట్ బౌలర్ అని చెప్పొచ్చు. అతనికి ఇప్పుడు దీటైన ప్లేయర్ ఎవరున్నారనీ. బహుశా ట్రెంట్ బౌల్ట్, షాహీన్ షా ఆఫ్రిది, జోఫ్రా ఆర్చర్ ఉన్నా.. వాళ్లకంటే ప్రస్తుతం బుమ్రా అత్యుత్తమంగా ఉన్నాడు' అని హుస్సేన్ ప్రస్తావించాడు.

బుమ్రా విషయంలో నేను అనుకుంటుంది కూడా అదే
ఈ విషయమై టెండూల్కర్ సైతం స్పందించాడు. బుమ్రా విషయంలో తనకు కూడా చాలా కాలంగా ఆ అభిప్రాయం ఉందని పేర్కొన్నాడు. నసీర్ హుస్సేన్ నేను అనుకుంటున్నదానికి తగ్గట్లు తన విశ్లేషణ జరపడం ఆనందంగా ఉందని చెప్పాడు. 'అన్ని ఫార్మట్లలో బుమ్రా అత్యుత్తమ బౌలర్ అని నేను కొంతకాలంగా అభిప్రాయపడుతున్నాను. నసీర్ హుస్సేన్ సైతం నాతో ఏకీభవిస్తూ వ్యాఖ్యానించడం చాలా బాగుంది.' అని టెండూల్కర్ తెలిపాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications