
హైదరాబాద్: సచిన్ టెండూల్కర్ పరిచయం అక్కర్లేని పేరు. రెండు దశాబ్దాల పాటు అంతర్జాతీయ క్రికెట్‌ను ఏలిన వ్యక్తి. అంతేకాదు ప్రపంచంలోని అగ్రశ్రేణి బౌలర్లకు ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపేలా చేశాడు. అలాంటి క్రికెట్ దిగ్గజాన్ని తాను తెలివిగా ఔట్ చేసేవాడినని దక్షిణాఫ్రికా మాజీ ఫాస్ట్ బౌలర్ పైనీ డివిలియర్స్ వెల్లడించాడు.
ప్రస్తుతం కోహ్లీ నేతృత్వంలోని టీమిండియా దక్షిణాఫ్రికా పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. మూడు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌ను మరో టెస్టు మిగిలుండగానే 0-2తో సిరిస్‌ను కోహ్లీసేన చేజార్చుకుంది. ఇరు జట్ల మధ్య జనవరి 24న జోహెన్స్ బర్గ్ వేదికగా మూడో టెస్టు మ్యాచ్ ప్రారంభం కానుంది.
ఈ నేపథ్యంలో గతంలో ఈ రెండు జట్ల మధ్య జరిగిన ఆసక్తికరమైన మ్యాచ్‌ల గురించి పైనీ మంగళవారం గుర్తు చేసుకున్నాడు. 1990ల్లో పరిమిత ఓవర్ల క్రికెట్‌లో అలెన్ డొనాల్డ్‌తో పాటు పైనీ డివిలియర్స్ అత్యుత్తమ ఓపెనింగ్ బౌలింగ్ గణాకంలాను నెలకొల్పాడు.
అదే సమయంలో క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ ప్రపంచంలోని అత్యుత్తమ బౌలర్లను నిద్రలేని రాత్రులు గడిపేలా చేశాడు. అలాంటి సచిన్‌ను తన బౌలింగ్‌లో 4 సార్లు ఔట్ చేశానని పైనీ డివిలియర్స్ చెప్పుకొచ్చాడు. 'సచిన్ టెండూల్కర్ నా బౌలింగ్‌ని లెక్క చేసేవాడు కాదు. ముఖ్యంగా నేను అప్పుడప్పుడు విసిరే స్లో బంతుల్ని అయితే.. గ్రౌండ్ వెలుపలకి బాదేవాడు' అని పేర్కొన్నాడు.
'ఆఫ్ కట్టర్ రూపంలో విసిరే ఆ స్లో బంతులకి ఉప ఖండం పిచ్‌లపై సాధారణంగా బ్యాట్స్‌మెన్ ఎక్కువగా క్యాచ్ రూపంలో ఔటయ్యే వారు. సచిన్ మాత్రం వెనుకంజ వేయకుండా హిట్టింగ్ చేసేవాడు. దీంతో అతడ్ని ఔట్ చేసేందుకు మళ్లీ.. మళ్లీ అవే బంతుల్ని సంధించేవాడ్ని. ఈ క్రమంలో నాలుగు సార్లు సచిన్‌ని ఔట్ చేయగలిగా' అని పైనీ చెప్పాడు.
భారత్-దక్షిణాఫ్రికా జట్లు తలపడిన మ్యాచ్‌ల్లో మొత్తం 16 సార్లు సచిన్ ఔటవగా ఇందులో నాలుగు సార్లు పైనీనే సచిన్‌ను పెవిలియన్‌కు చేర్చాడు.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.