హైదరాబాద్: ప్రపంచ క్రికెట్‌లోకి థాయిలాండ్ అరంగేట్రం చేయడం తనను ఎంతో ఆశ్చర్యానికి గురి చేసిందని క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ పేర్కొన్నాడు. వచ్చే వారం నుంచి శ్రీలంకలోని కొలంబోలో జరిగే వరల్డ్ కప్ అర్హత టోర్నీలో థాయ్‌లాండ్ ఆడనుంది.
ఈ ఏడాది జూన్-జులైలో జరిగే ఐసీసీ మహిళల వరల్డ్ కప్ టోర్నీ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లు ఐసీసీకి రాసిన కాలమ్‌లో సచిన్ పేర్కొన్నాడు. ఇంగ్లాండ్‌లో జరగనున్న వరల్డ్ కప్‌లో పంచ వ్యాప్తంగా ఉన్న కొందరు అత్యుత్తమ మహిళా క్రికెటర్లు పాల్గొంటారని, అటువంటి ఆటను కొన్ని నెలల్లో వీక్షించబోతున్నామని సచిన్ అన్నాడు.

మహిళల క్రికెట్ విస్తరణ లింగ సమానత్వం, హక్కులకు ఉత్ప్రేరకంగా సచిన్ అభివర్ణించాడు. మహిళా క్రికెటర్లు అద్భుతమైన ఆటతో యువతుల్లో క్రికెట్‌పై ఆసక్తిని పెంచుతుందని సచిన్ విశ్వాసం వ్యక్తం చేశాడు. ఈ మెగా టోర్నీలో టీమిండియా కెప్టెన్ మిథాలీ రాజ్, ఆల్‌రౌండర్ ఝూలన్ గోస్వామి రానున్న ప్రపంచకప్‌లో అద్భుతంగా రాణిస్తారని సచిన్ పేర్కొన్నాడు.
మరోవైపు, దక్షిణాఫ్రికా క్రీడాకారిణులు మిగ్నాన్ డు ప్రీజ్, డేన్ వాన్ నీకెర్క్, మరిజన్నె కాప్, పాకిస్థాన్ క్రికెటర్లు బిస్మా మరూఫ్, సనా మిర్ వంటి క్రీడాకారిణులు మంచి ఆటతీరుతో మహిళా క్రికెట్ టోర్నీలపట్ల ఆసక్తి పెంచేలా చేస్తున్నారని ఆయన అన్నాడు. ఫ్యాన్స్ అందరూ మహిళా క్రికెట్‌ను ప్రోత్సహించాలని సచిన్ సూచించాడు.