
ముంబై: భారత దేశంలో మహమ్మారి కరోనా (కొవిడ్ 19) వైరస్ రోజురోజుకు విజృంభిస్తున్న విషయం తెలిసిందే. మంగళవారం వరకు 128 కరోనా కేసులు నమోదు కాగా.. ముగ్గురు మృతువాత పడ్డారు. దీంతో దేశంలోని సెలెబ్రిటీలు ప్రజలకు సలహాలు, సూచనలు ఇస్తున్నారు. మహమ్మారి వణికిస్తోన్న నేపథ్యంలో వ్యక్తిగత పరిశుభ్రత ప్రాధాన్యతపై అవగాహన పెంచడం కోసం క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ముందుకొచ్చారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) 'సేఫ్ హ్యాండ్స్' చాలెంజ్‌ను ఆయన స్వీకరించారు.
చాలెంజ్‌లో భాగంగా తన చేతులను శుభ్రం చేసుకుంటున్న వీడియోను సచిన్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసారు. దాదాపు 20 సెకండ్లు సచిన్ చేతులు శుభ్రం చేసుకున్నారు. 'కరోనా వల్ల మనమంతా ఆందోళన చెందుతున్నాం. ఓ తేలికైన పని చేస్తే ఈ వైరస్ విస్తరించకుండా మనం అడ్డుకోవచ్చు. చేతులను శుభ్రంగా ఉంచుకుంటే చాలు. సబ్బుతో ఇరవై సెకన్ల పాటు చేతులను రుద్దుకొని కడుక్కోవడం తప్పనిసరి. ఎల్లప్పుడూ చేతులను బాగా శుభ్రం చేసుకోవాలి' అని రాసుకొచ్చారు.
అథ్లెట్ హిమ దాస్ కూడా 'సేఫ్ హ్యాండ్స్' చాలెంజ్‌ను స్వీకరించారు. చేతులను శుభ్రం చేసుకుంటున్న వీడియోను పోస్ట్ చేస్తూ.. 'ఎక్కడున్నా క్రమం తప్పకుండా చేతులను కడుక్కోండి. శుభ్రతపై ప్రతిఒక్కరు అవగాహన పెంచండి' అని పేర్కొన్నారు. చాలెంజ్‌ను స్వీకరించిన సింధు.. అమెరికా కాన్సుల్ జనరల్ క్యాథరిన్ హడ్డాకు ధన్యవాదాలు తెలిపారు. కరోనా వ్యాప్తిని తగ్గించేందుకు మనం అందరం కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరు తమ చేతులను శుభ్రపరుచుకోవాలన్నారు. ఇక కేంద్ర క్రీడల మంత్రి కిరణ్ రిజిజు, టీమిండియా క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ, భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జాలు ఈ చాలెంజ్‌ను స్వీకరించాలని సింధు కోరారు.
వైరస్‌కు భయపడొద్దని భారత స్టార్ షట్లర్లు కిదాంబి శ్రీకాంత్, సైనా నెహ్వాల్ ప్రజలకు సూచించారు. ఇలాంటి క్లిష్టపరిస్థితుల్లో భయపడకుండా, ఒకరికొకరు సహకరించుకోవాలని కిదాంబి శ్రీకాంత్ కోరారు. పరిశుభ్రత పాటించి బాధ్యతాయుతమైన పౌరులుగా మెలుగుదామని పిలుపునిచ్చారు. తన భర్త పారుపల్లి కశ్యప్ చేసిన ట్వీట్‌ను సైనా రీట్వీట్ చేసింది. అందులో ఓ ఇటలీ యువకుడు కరోనా వైరస్ దశలను సమగ్రంగా వివరించాడు