ముంబై: బ్యాటింగ్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ తన కుమార్తె సారాపై వచ్చిన వార్తలపై సోషల్ మీడియాలో స్పందించారు. తన కుమార్తె సినిమాల్లో నటించనుందంటూ వచ్చిన వార్తలపై ఆయన స్పందిస్తూ 'నిరాధారమైన ఊహాగానాలు' గా కొట్టి పారేశారు.
ఇటీవలే 42వ పుట్టినరోజు(ఏప్రిల్ 24)ని జరుపుకున్న ఈ టీమిండియా మాజీ కెప్టెన్ త్వరలో సారా సినిమాల్లో నటించనుందంటూ వచ్చిన వార్తలపై ట్విట్టర్‌లో స్పందించారు. గత కొన్ని రోజులుగా సారా టెండూల్కర్ (18) షాహిద్ కపూర్ సరసన నటించే సినిమా ద్వారా బాలీవుడ్‌లో అరంగేట్రం చేయనుందనే వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే.

ప్రస్తుతం భారత్‌లో జరుగుతున్న ట్వింటీ20 ఐపీఎల్ టోర్నమెంట్లో ముంబై ఇండియన్స్ జట్టుకు 'ఐకాన్'గా ఉన్న క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ తన కుమార్తెపై వచ్చిన వార్తలపై స్పందిస్తూ, తాను విద్యా ప్రయత్నాల్లో సంతోషంగా ఉందని పేర్కొన్నారు.
సోమవారం (ఏప్రిల్ 27)న సచిన్ టెండూల్కర్ తన ట్విట్టర్‌లో "నా కుమార్తె సారా ప్రస్తుతం విద్యా ప్రయత్నాల్లో సంతోషంగా ఉంది. ఆమె సినిమాల్లోకి వస్తుందంటూ వచ్చిన నిరాధారమైన ఊహాగానాలను ఖండిస్తున్నాను" అని ట్వీట్ చేశారు. సచినే స్వయంగా ఈ విషయాన్ని తెలపడంతో సారాపై ఇలాంటి రూమర్స్‌ని వ్యాప్తి చేసేవారు ఇకనైనా నోరు మూసుకుంటారేమో చూద్దాం.