బెంగుళూరు: క్రికెట్ దేవుడు, బ్యాటింగ్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ బుధవారం "సమ్‌థింగ్ వెరీ స్పెషల్"ను స్వీకరించడానికి తన అభిమానులను ఆహ్వానించారు. ఇంతకీ అభిమానులకు సచిన్ టెండూల్కర్ ఇవ్వనున్న ఆ సమ్‌థింగ్ వెరీ స్పెషల్ ఏంటని అనుకుంటున్నారా?
సచిన్ టెండూల్కర్ త్వరలో తన జీవిత విశేషాలతో కూడిన డాక్యుమెంటరీని రూపొందించనున్నారు. ఈ డాక్యుమెంటరీకి ఏ పేరు పెడితే బాగుంటుందో తెలియజేయాల్సిందిగా అభిమానులకు తన ట్విట్టర్ ద్వారా సలహా కోరారు.
మరో ట్వీట్‌లో మీరందరూ కలిసి చేయాలని అనుకుంటున్నాను. ఈ సినిమాకి ఏ పేరు పెడితే బాగుంటుంది. మీ ఆలోచనలు నాకు పంపండి అంటూ ట్వీట్ చేశారు.
నా సినిమాకి అత్యంత ఆదర్శ టైటిల్‌తో వచ్చిన వారి కోసం స్టోర్‌లో చాలా ప్రత్యేక ఉంది. నేను మీ నుండి వినడానికి వేచి ఉన్నానంటూ మరో ట్వీట్ చేశారు.
గత ఏడాది సచిన్ టెండూల్కర్ తన ఆటో బయోగ్రఫీని 'ప్లేయింగ్ ఇట్ మై వే' పుస్తక రూపంలో విడుదల చేసిన విషయం తెలిసిందే. భారత్‌లో ఈ పుస్తకం రికార్డు అమ్మకాలను నమోదు చేసింది. లండన్‌కు చెందిన జేమ్స్ ఎర్కిన్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా, సచినే ఇందులో నటిస్తుండటం విశేషం.

2013లో అంతర్జాతీయ క్రికెట్ నుంచి సచిన్ టెండూల్కర్ రిటైర్మెంట్ ప్రకటించినా ఇంకా అభిమానులు ఆయన్ని గుండెల్లోనే పెట్టుకున్నారు. ఐసీసీ వరల్డ్ కప్‌లో భాగంగా మెల్ బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌లో జరిగిన భారత్-దక్షిణాఫ్రికా మ్యాచ్‌ని వీక్షించేందుకు వచ్చిన సచిన్ టెండూల్కర్‌ను చూసిన అభిమానులు సచిన్ నామస్మరణతో స్టేడియం మొత్తం మోత మోగించిన విషయం తెలిసిందే.